ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీ నేతల మధ్య లడాయి ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ లో ముసలం ఏర్పడినట్లు తెలుస్తోంది.
క్రీడాకారులు.. కళాకారులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి గువ్వల బాలరాజ్ ను ఆహ్వానించకపోవడం పట్ల అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాల్ని ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. కిన్నెరతో అంతరించిపోతున్న కళను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చి ఆమధ్య పద్మశ్రీ అవార్డును పొందిన కిన్నెర మొగులయ్యకు బీఎన్ రెడ్డి నగర్ లో జాగా ఇవ్వటాన్ని గువ్వల తప్పు పట్టారు.
కిన్నెర మొగులయ్య కళను వెలుగులోకి తీసుకొచ్చింది తానని..ఆయనను ఢిల్లీకి తీసుకెళ్ళి ఆయన కళను ప్రపంచానికి తెలిసేలా చేసింది కూడా తానేనని..అలాంటిది తనను వదిలేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టాలు ఇవ్వడంపై గువ్వల గరంగరం అయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మోఘులయ్యకు పట్టాలు ఇచ్చే సమయంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అద్యక్షుడిగా తనను ఆహ్వానించకపోవడంపై మంత్రి తీరును తప్పుబట్టారు. ఇది సరైంది కాదని.. శ్రీనివాస్ గౌడ్ పద్ధతి మార్చుకోవాలని సలహా ఇచ్చారు. మంత్రి ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని ఈ విషయమై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసి తేల్చుకుంటానని స్పష్టం చేశారు.