అనేక పరిణామాల మధ్య ఏపీ క్యాడర్ లో చేరిన సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు మొగ్గు చూపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత హోదాలో పని చేసిన సోమేశ్ కుమార్…ఏపీ ప్రభుత్వంలో చిన్న స్థాయిలో పని చేయడం ఇష్టం లేక వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నా…అసలు మతలబు వేరే ఉందన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం… ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఆదేశించడంతో సోమేశ్ కుమార్ విధిలేని పరిస్థితుల్లో ఏపీలో రిపోర్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్ళినా అక్కడ కూడా ఆయనకు మంచీ ప్రాధాన్యత గల పోస్టును ఆఫర్ చేస్తారని అనుకున్నారు. సోమేశ్ కుమార్ ఏపీ సీఎం జగన్ ను కలిసినప్పుడు గౌరవం తగ్గకుండా చూసి పోస్టింగ్ ఇస్తామని తనకు ఆఫర్ చేశారు. అయినా.. సోమేశ్ కుమార్ మాత్రం వీఆర్ఎస్ పై పట్టు వీడటం లేదు.
ఈమేరకు వీఆర్ఎస్ లేఖను సీఎం జగన్ కు పంపారు సోమేశ్ కుమార్. మంచి పోస్టింగ్ ఇస్తామని జగన్ ఆఫర్ చేసినా నిరాకరించడంతో ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కూడా రెడీ అయ్యారు. వీఆర్ఎస్ ఫైల్ పై రేపోమాపో జగన్ సంతకం చేయనున్నారు. కేసీఆర్ కు కీలక అంశాల్లో అనుకూలంగా వ్యవహరించిన సోమేశ్ కుమార్ సేవలను వాడుకోవాలని జగన్ అనుకున్నారు కానీ ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణ సీఎస్ గా పని చేసిన సోమేశ్ కు ఏపీకి వెళ్ళిన తరువాత నామమాత్రమైనా పోస్ట్ లభిస్తే ఏంటన్న చర్చ జరిగింది. అందుకు ఆయన చెప్పిన సమాధానం అందర్నీ మంత్రమూగ్దుల్ని చేసింది. తాను సర్వీసుకు నిబద్ధుడినై ఉంటానని, పదవుల్లో చిన్నా పెద్దవి అనేవి పట్టించుకోనని, ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా చేస్తానని చెప్పారు. దాంతో ఆయన సర్వీసు పూర్తి కాలంలో ఏపీ సర్కార్ అప్పగించే బాధ్యతలను నిర్వర్తిస్తారని నమ్మకం కల్గింది. అంతలో ఏమైందో ఏమో..వీఆర్ఎస్ అంటూ బాంబ్ పేల్చేశారు.
వీఆర్ఎస్ తీసుకోవాలనే నిర్ణయం సోమేశ్ కుమార్ ది కాదట. తెలంగాణ సర్కారే ఆయన వీఆర్ఎస్ కు ఒత్తిడి చేసిందని ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెడుతామని కేసీఆర్ నుంచి తీపికబురు అందటంతోనే సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.