తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్ళు తనకు ఎదురేలేదనుకున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని దూకుడుగా సాగేవారు. అనుకున్న టైంకి అన్ని కార్యక్రమాలు ముగించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన అనుకున్న వ్యూహాలు, కార్యక్రమాలు పక్కాగా అమలు కావడం లేదు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని అవుట్ డేటెడ్ నేతల్ని కారు ఎక్కిస్తున్నారు.
ఇది మొదలు…సెక్రటేరియట్ ప్రారంభం వరకు ఏదీ కేసీఆర్ డిజైన్ చేసిన కార్యక్రమంగా లేదు. అన్ని వాయిదాలు పడుతున్నాయి. కేసీఆర్ లో రాజకీయం చతురుత తగ్గిందా..? అనే అనుమానం కల్గుతోంది. ఎందుకంటే..బీజేపీతో శతృత్వం పెంచుకున్న కేసీఆర్ ను కేంద్రం టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ గారాలపట్టిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. అంతేకాదు పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. పైకి కేసీఆర్ గుంభనంగా కనిపిస్తోన్న లోలోపల మాత్రం చాలా ఆందోళనగానే ఉన్నారు. ఇవన్నీ కేసీఆర్ రాజకీయ మేధాశక్తిని బలహీనం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి.. సెక్రటేరియట్ ఓపెనింగ్ ముహూర్తం ఖరారు చేసినప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని సర్కార్ కు తెలుసు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు. అయినా ముహూర్తం పెట్టేశారు. సెక్రటేరియట్ ఓపెనింగ్ కు – ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏమంత అడ్డంకి కాదు. సెక్రటేరియట్ ఓపెనింగ్ కు అనుమతి కావాలంటూ ఈసీకి ఓ లెటర్ రాస్తే ఖచ్చితంగా అనుమతి ఇస్తుంది. కానీ ఆపని చేయడం లేదు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం తరువాత బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. ఆ సభ కూడా వాయిదా పడింది. ఇలా కేసీఆర్ పక్కాగా ప్లాన్ చేసుకొన్న కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఈ లెక్కన చూస్తే కేసీఆర్ మునుపటి దూకుడు లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ… మేం మీ జోలికి రాం.. మీరు మా జోలికి రాకండని కేంద్రానికి స్పష్టం చేశారు. కేంద్రం వైపు నుంచి ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయేమోనని అందుకే కేసీఆర్ జోరు తగ్గించారన్న వాదన వినిపిస్తోంది.