దివంగత నేత ఎన్ టి రామారావుకు కేంద్ర ప్రభుత్వం ఎనలేని గౌరవాన్ని ఇస్తూ వంద రూపాయల నాణెం మీద ఆయన బొమ్మను ముద్రించాలని నిర్ణయించింది. అందరికి సంతోషం కలిగించే వార్తే. ఇది మంచి మనసుతో చేస్తే బాగుండేది. కానీ ఇందులో కూడా బిజెపి మార్క్ రాజకీయం చూపింది.
ఎన్ టి రామారావు కు భారత రత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ లో దీని మీద చర్చ కుడా జరిగింది. ఎన్ టి రామారావు ఓ ప్రాంతీయ నటుడు, ప్రాంతీయ రాజకీయ నాయకుడు, అతను దేశానికి చేసింది ఏముంది? అని బీజేపీ ఎంపీలు ఎద్దేవా చేశారు. కనీసం ఎన్ టి రామారావు బొమ్మతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయమని డిమాండ్ చేశారు. ఈమద్యే దర్శక నిర్మాత ఎల్. వి. ప్రసాద్ స్టాంప్ విడుదల చేసామని, ఇప్పట్లో మరో తెలుగు వాడిది వేయలేమని ఎద్దేవా చేసారు.
ఎన్ టి రామారావు 25వ వర్దంతి సంధర్బంగా మరోసారి రెండు డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. ఎప్పటిలా బీజేపీ పెడచెవిన పెట్టింది. కానీ ఉన్నట్టుండి ఉరుములు లేని పిడుగులా వంద రూపాయల నాణెం మీద ఎన్ టి రామారావు బొమ్మను ముద్రించాలని బీజేపీ నిర్ణయించింది. దీని వెనకున్న ఎత్తుగడ అందరికి అర్థమయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పాగా వేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాస్త దూకుడు పెంచింది. ఏపీలో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరిపింది. ఇందులో భాగంగా ఓటర్లను మచ్చిక చేసుకోడానికి ఎన్ టి రామారావు గుడ్ విల్ ని ఎరలా వాడుకుంటోంది. అసలు నాణెం మీది ఎన్ టి రామారావు బొమ్మ వేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకే రాలేదు. కానీ బీజేపీ చేసింది. ఈ లెక్కన ఏపీలో కమ్మ సామజిక వర్గం ఓటర్లను గంపగుత్తగా పొందాలనే వ్యూహం ఉండొచ్చు.