వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పాదయాత్ర ద్వారా ఓ వైపు రేవంత్ రెడ్డి భరోసా కల్పిస్తుంటే.. పార్టీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వచ్చేది హాంగ్ ప్రభుత్వమేనని.. కాబట్టి బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు. బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయి. చచ్చినా బీఆర్ఎస్ తో కలవబోమని రేవంత్ మొదలు రాహుల్ గాంధీ వరకు పదేపదే చెప్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ తో కలిస్తేనే అధికారంలోకి వస్తామని కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ లో సీనియర్లంతా కష్టపడి పని చేస్తే పార్టీకి 40 నుంచి 50సీట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు.. రేవంత్ తో ఏమి కాదని.. ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే పార్టీని పవర్ లోకి తీసుకోస్తారని మాట్లాడిన కోమటిరెడ్డి సడెన్ గా సీనియర్లు డమ్మీలని తేల్చేశారు. సీనియర్ నేతలతో కూడా ఒరిగిదెం ఉందన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60సీట్లు. బీఆర్ఎస్ కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదని తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి చెబితే తాము ఇంట్లో కూర్చుంటామని మరోసారి అక్కసు వెళ్లగక్కారు.
అయితే..కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు ఒకే తాను ముక్కలని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గత కొద్దికాలంగా కమలనాథులు చెప్తూ వస్తున్నారు. వాటిని రేవంత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ కంటే కాంగ్రెస్ పాలనే బెటర్ అంటూ కితాబివ్వడంతో..మరోసారి బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు మైత్రి బయటపడిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
స్టార్ క్యంపెయినర్ గానున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బీజేపీ ప్రచారాన్ని ఖండించాల్సిందిపోయి.. వారి ప్రచారానికి బలం చేకూర్చేలా కామెంట్స్ చేయడం చర్చగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ప్రకటిస్తానని చెప్పడంతో.. తమ్ముడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని అభిప్రాయాలు వినిపించాయి.
గతేడాది ప్రధాని మోడీ, అమిత్ షా తో భేటీ అయ్యారు. వారి మధ్య జరిగిన చర్చలో ఎయె అంశాలను చర్చించారో అప్పటి నుంచి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లోనే కొనసాగుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారన్న అనుమానాలను పార్టీ వర్గాలు వ్యక్తం చెస్తున్నాయి.