తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో తెలిసిందే. అవసరానికి ఎవరితో ఎలా మెదలాలో ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలియదని అంటుంటారు. ఇన్నాళ్ళు ఈటల మొహం కూడా చూసేందుకు ఇష్టపడని కేసీఆర్…ఇప్పుడు ఆయనపై అమితమైన అభిమానం కురిపిస్తున్నారు. ఆదివారం నాటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ చాలా సార్లు ఈటల రాజేందర్, రాజేందరన్న అంటూ ఆప్యాయత కనబరచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈటల విషయంలో కేసీఆర్ ప్రతిసారి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఆయన లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకో.. హరీష్ అంటూ ఆదేశించారు. ఈటల బీజేపీలోకి వెళ్ళాడు కాబట్టి..ఆయన చెప్పినవి చేయం. మాకు ఇష్టమైతేనే చేస్తామనే ధోరణి ఉండదు. అవసరమైతే కొన్ని అంశాల్లో ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి సలహాలు కూడా తీసుకుంటాం. డైట్ చార్జీలు పెంచాలని ఈటెల రాజేందర్ కోరిక మేరకు వెంటనే పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ మారినంత మాత్రానా తమ మధ్య శతృత్వం ఏర్పడదనే సందేశాన్ని వ్యక్తపరిచారు. సహజంగా కేసీఆర్ తన శతృవు వర్గంగా ఏర్పడిన వారిపై కక్ష సాధిస్తారు.ఈటల పార్టీ ఫిరాయించిన సమయంలో ఇది స్పష్టంగా కనబడింది. కానీ అనూహ్యంగా ఈటలపై ప్రేమ కనబరుస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఈటల బీజేపీలోకి వెళ్ళలేదు. బలవంతంగా గెంటేశారు. ఆయన భూములు.. ఆస్తులపై దాడులు జరిగాయి. ఆ తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఆయనను ఓడించడానికి ఏకంగా దళిత బంధు పథకం తీసుకొచ్చారు. కానీ ఆయనను ఓడించలేకపోయారు. కేసీఆర్ ఎదురించి గెలిచాడని ఈటల మొహం చూడలేకే గత అసెంబ్లీ సమావేశాల్లో ఆయన్ను సస్పెండ్ చేయించారని విమర్శలు వచ్చాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలోనివి మనస్సులో పెట్టుకోకుండా బీఆర్ఎస్ లో చేరాలని ఇటీవల ఈటలను కేసీఆర్ ఆహ్వానించారన్న ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే తాజా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కేటీఆర్ , ఈటల కాసేపు మాట్లాడుకోవడం.. హరీష్ రావు కూడా రాజెందరన్నా అని సంబోధించడం.. అసెంబ్లీలో ఈటల మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వడం చూస్తుంటే.. కేసీఆర్ ఈటలపై ప్రత్యేక తరహ అభిమానం చూపడం..ఇదంతా మైండ్ గేమ్ గా తెలుస్తోంది. ఈటలను బీఆర్ఎస్ లోకి లాగేందుకు కేసీఆర్ ఈ విధంగా ట్రై చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.