‘మాంగల్యం తంతునా నేన మమజీవన హేతునా’ దీని అర్థం తెలిసే చాలామంది చదువకున్న వాళ్లు భార్య మేడలో తాళి కడతారు. చదువు రాకపోయినా దీని అర్థం తెలిసిన సాములు అనే భర్త తన భార్య ‘గురు’ శవాన్ని భుజనా వేసుకుని నడక రోడ్డు మీద 130 కిలో మీటర్ల మొదలు పెట్టాడు. కటిక పేదరికం. అంబులెన్సుకు డబ్బులు లేవు. బతికున్న వాడికే లిఫ్ట్ ఇవ్వని స్వార్థపరులున్న రోజుల్లో శవానికి లిఫ్ట్ ఇచ్చే నాథులు ఎవడు? ‘పట్టువీడని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడక మొదలు పెట్టాడు’ అని చిన్నప్పుడు మనం చదువుకున్న చండమామ కథ గుర్తుకు వచ్చింది.
పూర్వపరాల్లోకి వెళ్ళితే – సాములు అనే నిరుపేద ఒరిస్సా లోని కోరాపుట్ అనే జిల్లా వాసి. అతని భార్య గురు అనారోగ్యానికి గురయ్యింది. సడోరా గ్రామంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె బతకడం కష్టమని, జిల్లా హెడ్ క్వార్టర్ కి తీసుకెళ్ళమని గెంటేశారు. ఆమెను ఆటోలో తీసుకుని వెళ్ళాడు. ఈ జన్మకు ఈ ప్రేమ ఇక చాలు అన్నట్లు అన్ని బంధాలు తెంచుకుని ఆమె మార్గం మధ్యలో తుది శ్వాస విడిచింది.
అది గమనించిన ఆటో డ్రైవర్ శవాన్ని ఆటోలో తీసుకువెళ్ళనని మొండికేసాడు. సాములు దగ్గరున్న రెండు వేలు దండుకుని, శవాన్ని నడిరోడ్డు మీద వదిలి చెక్కేసాడు. అక్కడినుంచి అతని ఉరు 130 కిలో మీటర్ల దూరం. చేతిలో చిల్లి గవ్వ లేదు. రూపాయి దానం చేసే మానవ మాత్రుడు కనిపించలేదు. ఏ ఒక్కరు శవానికి లిఫ్ట్ ఇవ్వలేదు. గుండె రగిలి ఏడ్చిన సాములు తన కన్నీళ్లను తానే దిగమింగుకున్నారు. నలుగురు మోయవలసిన శవాన్ని ఒక్కడే మోశాడు. ఆమెను భుజాన వేసుకుని నడక ప్రారంబించాడు. దారిపొడుగునా అందరూ తమాషా చూసేవాళ్ళే. ఒక్కడు ముందుకు రాడే! ఒక్కడూ సాయం చేయడే!
ఎవరో పుణ్యాత్ముడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. నల్ల కాకులల్లో కూడా కొన్ని తెల్ల కాకులు ఉంటాయి. అలాగే కరుడుగట్టిన ఖాకి డ్రెస్ లల్లో కొందరు ఖద్దరు పోలీసులు కూడా ఉంటారు. వెంటనే సిఐ తిరుపతి రావ్, ఎస్ఐ కిరణ్ కుమార్ వచ్చి విషయం తెలుసుకుని షాకయ్యారు. కట్నం కోసం భార్యలను చంపే కేసులు బుక్ చేసిన వాళ్లు, కీప్ కోసం భార్యలను కడతేర్చే కేసులు రాసిన వాళ్లు, అనుమానం పేరుతో భార్యలను హతమార్చిన కేసులు రాసిన వాళ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ద్రవించింది.
ముందుగా సాములు కన్నిలు తుడిచారు. ఓదార్చారు. అతని ప్రేమను, త్యాగాన్ని మెచ్చుకున్నారు. అంబులెన్స్ ని పిలిపించి ఆ శవాన్ని ఎక్కించారు. ఆమెకు కర్మకాండ చేయమని పది వేలు ఇచ్చి తమ మానవత్వాని చాటుకున్నారు. ఒక కాకి చస్తే వందకాకులు వస్తాయి. కానీ ఒక మనిషి చస్తే వందమంది ఎందుకు సహాయం చేయరో. తిరుపతి రావ్, కిరణ్ కుమార్ లాంటి మానవ మూర్తులను మనలో ఎందరు? దానికిమించి సాములు లాంటి ఉత్తమ భర్తలు ఎందరు?