తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని కెసిఆర్ ఇచ్చిన ప్రకటనలు కోకా కోలా – తమ్సప్ వ్యాపార ప్రకటనల కంటే వంద రెట్లు ఎక్కువ. దానికి తోడూ హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చుతాము – విశ్వదాభిరామా వినుర వేమా అని నీతులు చెప్పారు. బాగానే ఉంది. తెలంగాణ బడ్జెట్ చూస్తే మూల విరాట్టుడే మూలకు కూర్చుంటే – నైవేద్యం లేదని ఉత్సవ విగ్రహాలు ఏడిచినట్లు ఉంది.
ప్రధానమైన శాఖలకు ఎలాగో అరకొర నిధులు కేటాయించారు. కనీసం చిన్న చిన్న శాఖలకు కూడా సరిపడే నిధులు కేటాయించలేదు. దీనికి తోడూ బిఆర్ఎస్ లో చెక్క భజన చేసేవాళ్ళు మరీ ఎక్కువయ్యారు. రాజు గారు దగ్గినా చప్పట్లు కొట్టడం – పిత్తినా చప్పట్లు కొట్టడం లాగా ఆర్థిక మంత్రి ఏం చెప్పినా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు బాడుడే బాదుడు. ఇదెక్కడి చెక్క భజన?
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ది కి రూ.11,372 కోట్లు కేటాయిస్తారా? దానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు తరుస్తారా? తెలంగాణలో పట్టణాలు ఎన్ని? ఒకొక్క పట్టణానికి దీనిని పంచితే ఎంత వస్తుంది? అందులోంచి హైదరాబాద్ కి దక్కేది ఎంతా? ఆకలితో ఉన్నవాడికి కిల్లి ఇచ్చి కడుపు నింపుకో అన్నట్లు ఉంది. ఇచ్చిన బడ్జెట్ మున్సిపల్ కార్మికుల జీతభత్యాలకే సరిపోవు. ఇక ఈ నగరాన్ని విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దుతారు? అలా మార్చాలంటే కనీసం 5 లక్షల కోట్లు కావాలని కెసిఆర్ కి తెలియదా? రాష్ట్ర మొత్తం బడ్జెట్ మూడు కోట్లు దాటనప్పుడు నగరాన్ని విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దుతారు?
దళిత బంధు పథకం కింద ప్రతి దళితుడికి పది లక్షలు కేటాయిస్తామని తెగ ఊరించారు. తిరా చూస్తే ఎస్సి వెల్ఫేర్ కు కేటాయించిన సొమ్ము రూ. 3,965 కోట్లా?తెలంగాణలో ఉన్న దళితులకు పంచితే తలా ఎన్ని రూపాయలు వస్తాయి.
ఇలా ఏ శాఖ ను చూసినా చాలీచాలని నిధులు. మా దగ్గర డబ్బు లేదు – పిండి కొద్ది రొట్టె చేస్తాము అని నిజాయితీగా చెపితే తెలంగాణ ప్రజలు దండ వేస్తారు. కానీ బంగారు తెలంగాణ చేస్తాము – హైదరాబాద్ని విశ్వనగరం గా మార్చుతాము లాంటి బట్టేబాజ్ మాటలు చెపితే చెప్పుల దండ వేస్తారు.