భారతదేశంలో మెజార్టీ మతస్తులు హిందువులే. అందుకే హిందుత్వ కార్డును అప్లై చేస్తూ బీజేపీ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని తహతహాలాడుతోంది. మతాన్ని ఎంతరెచ్చగొడితే అన్ని ఓట్లు రాలుతాయని మతతత్వ రాజకీయాలు చేస్తోంది. ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తిని ఏమాత్రం పట్టించుకోకుండా లౌకికవాదానికి తిలోదకాలు ఇస్తోంది.
బీజేపీ వైఫల్యాలు చర్చకు వచ్చిన ప్రతిసారి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తోంది. దేశ ప్రజలను సైతం అటువైపు డ్రైవ్ చేస్తోంది. దేశ ప్రజల బుర్రలోకి మతాన్ని బలంగా తీసుకెళ్ళి సొంత ఆలోచనలను దూరం చేసింది. ఇప్పుడు దేశమంతా ఓ మౌడ్యంలోకో వెళ్ళింది. మతం అన్నం పెట్టదు.. మనం మునిగిపోతున్నామని చెప్తున్నా..మునిగినా పర్వాలేదు అనే స్థితికి భారత సమాజం వేగంగా చేరుకుంటుంది. ఇది లౌకిక వాదులను ఆందోళనకు గురి చేస్తోండగా.. దేశ పాలకులకు హాయినిస్తోంది. ఎందుకంటే…ఈ మతం వలన అధికారం శాశ్వతం అవుతుందనేది బీజేపీ ఆలోచన.
వ్యక్తిగా ప్రధాని మోడీ, అమిత్ షాలను అభిమానిస్తే తప్పు లేదు. అంతెందుకు వ్యక్తిగా ఎవరినైనా అభిమానిస్తాం. కానీ అభిమానం ఆరాధన స్థాయికి చేరుకోకూడదు. అది ప్రమాదానికి దారితీస్తుంది. మన కళ్ళు మనల్నే పొడిచేలా చేస్తుంది. ఇప్పుడు ప్రధాని మోడీని అభిమానించే స్థాయిని దేశం క్రాస్ చేసి ఆరాదిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మోడీ ఖాతాలో వేయడానికి మనసొప్పడం లేదు. మనస్సు అంగీకరించదు కూడా. ఎందుకంటే..ప్రధానిని విమర్శిస్తే మతాన్ని, దేశాన్ని విమర్శించినట్లు అవుతుందనే స్థితికి చేరుకున్నాం కనుక.
దేశంలో పరిస్థితులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రజల ఆలోచన సరళి మరింత కృంగదీస్తోంది. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అదాని. అందుకు ప్రధాని మోడీ సహకారం ఉందనేది ఓపెన్ సీక్రెట్. అదాని వ్యాపార సామ్రాజ్యంపై హిండెన్ బర్గ్ ఓ నివేదిక విడుదల చేస్తే.. దానిని దేశంపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. అదాని హిందువు కనుక ఆయన టార్గెట్ గా ఈ దాడులు కొనసాగుతున్నాయని ప్రచారం చేశారు. అదాని సంస్థలపై నివేదిక వెలువడితే అది దేశంపై దాడి ఎలా అవుతుంది..? ఈ విషయాన్నీ ఏమాత్రం ఆలోచించని స్థితికి మతం వేలుపట్టుకొని నడిపిస్తోంది. దీనిని విజయవంతంగా నడిపిస్తోంది బీజేపీ.
ఇటీవల కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ..దేశంలో రైతు రుణాలను ముక్కుపిండి మరి వసూళ్లు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు వందల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వాన్ని.. రైతుల రుణాలను కూడా మాఫీ చేయాలనీ అడగాల్సింది పోయి… రైతు రుణాలను ముక్కు పిండి వసూళ్లు చేయాలనీ అనడం సరైనదేనా..? ఎక్కడున్నా హిందుత్వ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని అంటారు కదా. మరి.. ఈ దేశంలో వ్యవసాయం చేస్తోన్న వారిలో హిందువులే అధికం. అలాంటప్పుడు రైతు రుణాలను మాఫీ చేస్తే లబ్ది పొందేది హిందువులైనా రైతులే. కానీ ఇక్కడ హిందుత్వ కార్డును అప్లై చేయడం లేదు బీజేపీ. ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు సైతం. ఇకపోతే.. కోవి షీల్డ్ వాక్సిన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని భారత సంతతికి చెందిన బ్రిటన్ కార్దియలగిస్ట్ ఆసీం మల్హోత్రా పరిశోధనలో తేలిందని చెప్పారు.
ఈ పరిశోధనలకు మోడీకి సంబంధం లేదు. కానీ ఈ పరిశోధనలు భారత్ ఉత్పత్తి చేసిన టీకా సామర్ధ్యాన్ని తక్కువ చేసి చూపడమేనని అంటున్నారు. ఏ దేశం ఉత్పత్తి చేసిన టీకా అయిన దానివలన దుష్పరిణామాలు ఉంటె దానిని తీసుకోకూడదు. కాని ప్రతిష్టకు పోయి టీకా తీసుకుంటే నష్టపోయేది ప్రజలే. అందుకే ఈ టీకా ప్రభావంపై వస్తోన్న ఆరోపణలపై మరిన్ని పరిశోధనలు జరగాలి. ఈ టీకా వలన ఎలాంటి ప్రభావం ఉండదని పరీక్షల్లో తేలితే ఎలాంటి నష్టం లేదు. కాని అనారోగ్య సమస్యలు తలెత్తితే టీకాపై నిషేధం విధించాలసిందే. వీటిని పక్కన పెట్టేసి ఈ టీకా గురించి బయటకొచ్చిన సమాచారంలో వాస్తవం ఎంత..? తెలుసుకోకుండా దేశంపై దాడి అని, హిందుత్వ ప్రధానిపై దాడి అని సర్టిఫికేట్ ఇస్తున్నారంటే దేశం ఏ స్థితికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని ఎవరు కాపాడుతారో..!