మహాసేన రాజేష్ జనసేనలో చేరుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఆయన యూట్యూబ్ చానెల్ మహాసేన మీడియాలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా కథనాలు రావడంతో అంత నిజమేనని అనుకున్నారు. ఇంతలోనే ఆయన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, అచ్చెన్నతో సమావేశమయ్యారు. త్వరలోనే రాజేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
దళిత వర్గాల్లో మహాసేన రాజేష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన.. ఎన్నికల తరువాత వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా మారితే ఎలా ఉంటుందో తెలిసిందే. మహాసేన రాజేష్ ను వేధించారు. ఎన్నో కేసులు పెట్టి అర్దరాత్రులు స్టేషన్ కు తీసుకెళ్ళారు. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. దాంతో ఆయన పోరాటస్ఫూర్తి పలువురిని ఆకర్షించింది.
సమకాలీన రాజకీయ అంశాలపై పరిజ్ఞానం ఉన్న రాజేష్.. యూట్యూబ్ పేరుతో చానెల్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేస్తోన్న మోసాలను బయటపెడుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపారు. జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అంతలోనే ఆయన టీడీపీ వైపు మొగ్గారు. పార్టీలో చేరితే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
సోషల్ మీడియాపై రాజేష్ కు మంచి గ్రిప్ ఉంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నారు. గోదావరి జిల్లాలో ఎదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మహాసేన రాజేష్ ను తమ వైపు తిప్పుకోవడం వలన దళిత వర్గాలు కొన్ని టీడీపీ వైపు మొగ్గే అవకాశం ఉంది.