తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అభివృద్ధి పనుల కోసమే కేసీఆర్ ను కలిశానని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే తప్పు లేదు. ఓ ఎమ్మెల్యేగా సీఎంను కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో గతంలో సమావేశం అయ్యారు. అభివృద్ధి పనుల కోసమే వారిని కలిసినట్లు చెప్పారు. ఇప్పుడు అదే వాదనను జగ్గారెడ్డి వినిపిస్తున్నారు. ప్రధానిని కోమటిరెడ్డి కలిసిన తరువాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనకపోవడం..ఎన్నికలకు నెల రోజుల సమయం ఉందనగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెప్తానని అనడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ సంగారెడ్డి టికెట్ పై హామీ ఇస్తే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగ్గారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది టీఆర్ఎస్ నుంచే. ఆ తరువాత హరీష్ రావుతో పొసగక కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేక కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. కాంగ్రెస్లో ఆయన ఇమడలేకపోతున్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డిని ఏ పార్టీలు సైతం చేర్చుకునేందుకు రెడీగా లేవు.
ఎందుకంటే ఆయన ఎక్కడ నిలకడగా ఉండలేరు. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటారు. బహిరంగంగానే పార్టీపై దుమ్మెత్తిపోస్తారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. బీఆర్ఎస్లో చేరేందుకు స్థానిక నేతలు అడ్డం పడతారు. అందుకే ముందుగా కేసీఆర్ ను కన్విన్స్ చేసేందుకు జగ్గారెడ్డి సమావేశం అయ్యారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.