బీజేపీ సీనియర్ నేత బాబు మోహన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ బీజేపీ కార్యకర్తతో ఫోన్ మాట్లాడుతూ..ఏకంగా రాష్ట్ర అద్యక్షుడినే ఎవడ్రా బండి సంజయ్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఆడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.
2018లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ ను కాదని క్రాంతి కిరణ్ కు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అసంతృప్తికి లోనైనా బాబు మోహన్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరుఫున పోటీ చేశారు కాని, తీవ్ర ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ కార్యక్రమాల్లో అడపాదడప పాల్గొనే వారు. ఏమైందో ఏమో కాని కొన్నాళ్ళుగా ఆయన పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కడం లేదు. కారణం…బాబు మోహన్ ను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడమే. బాబు మోహన్ పై ఆందోల్ లో వ్యతిరేకత ఉండటంతో ప్రత్యామ్నాయ నేతను ప్రోత్సహించాలని బండి సంజయ్ యోచిస్తున్నారని , ఇది తెలిసే రాష్ట్ర నాయకత్వంపై బాబు మోహన్ ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా జోగిపేటకు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశం అవుతున్నాయి. నువ్వెంత..? నీ బతుకెంత..?నీకు 41. అంటే నా అనుభవం అంత వయస్సు లేదు నీకు..నీకు ఓటు బ్యాంక్ ఉంది రెండు వేలా..? నువ్వొక బచ్చావి. గల్లీ లీడర్ వి. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీకు ఎంత ఓటు బ్యాంకు ఉంది. 2 వేలా.. నువ్వొక బచ్చావి. నువ్వు గల్లి లీడర్.. నేను రాష్ట్ర నాయకుడిని ప్రపంచ నాయకుడిని.. మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం. నువ్వు ఫోన్ రికార్డు చేసి.. బయటకు ఇవ్వాలని చూస్తున్నావ్. భయపడేదిలేదు. ఇచ్చుకో. నువ్వు నాకు ఫోన్ చేయకు. ఇంకో సారి ఫోన్ చేస్తే.. జోగిపేటలోనే చెప్పుతో కొడతా.. నా కొడక. ఎవడ్రా బండి సంజయ్.. ” అంటూ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తపైనే కాకుండా బండి సంజయ్ పై కూడా నోరు పారేసుకోవడంతో బాబు మోహన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ పార్టీ పేరును ప్రస్తావిస్తారు. అలాంటి పార్టీలో రాష్ట్ర అద్యక్షుడిపై సొంత పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.