కడుపులో చల్ల కదలకుండా..ఇస్త్రీ బట్టలు నలగకుండా ప్రభుత్వం ఉద్యోగం చేసే టీచర్లను చాలామందినే చూసుంటారు. కాని విద్యార్ధులకు పాఠాలు బోదించకపోతే నా కంచంలోని అన్నం ముద్ద సహించదని ప్రకటించే టీచర్లను మీరెప్పుడైనా చూశారా..? అంతటి కమిట్మెంట్ ఉన్న టీచర్లను చూసుండరు కదా.
ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసీం. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా వేతనం అందుకుంటే తనకు అన్నం ముద్ద సహించదని అంటున్నారు. భవిష్యత్ నిర్మాణం కోసం కోటి ఆశలతో వర్సిటీకి వచ్చే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే..మా పిల్లలకు చదువు చెప్పేందుకు అధ్యాపకులని నియమించండయ్యా అంటూ ఆయనే దీక్షకు దిగారు.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండంటూ సోమవారం ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రొఫెసర్ కాసీం దీక్ష చేపట్టారు. తాను దీక్షకు దిగితే పేద విద్యార్థులు తరగతులు నష్టపోతారని.. దీక్షా శిబిరాన్నే చదువుల క్షేత్రంగా మార్చాడు ఆ మాష్టారూ. నాకు వర్శిటీలో ఉద్యోగముంది. పిల్లలు వస్తేనే పాఠాలు చెప్తా. ఎవరూ రాకుంటే బెల్ మోగగానే ఇంటికి వెళ్తాననే ధోరణితో ఎందఱో ప్రొఫెసర్లు ఉండొచ్చు. కాని ఆయన మాత్రం అలాంటి అధ్యాపకుడు కాదు. పేద పిల్లల జీవితాల్లో నిండు పున్నమిని వికసింపజేయాలని పరితపించే అభ్యుదయవాది కాశీం.
తెలంగాణను రాష్ట్ర ఏర్పాటును స్వప్నించాడు. ప్రేమించాడు. రాష్ట్ర ఏర్పాటు తరువాత విద్యా వ్యవస్థ కునారిల్లిపోతుంటే గతంలో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన కాసీం.. ఇది కాదు కదా. కోరుకున్న తెలంగాణ అని దుఖిస్తున్నాడు. తల్లడిల్లిపోతున్నాడు. ఉద్యమానికి ఊపిరిపోసిన ఓయూలో అధ్యాపకులు లేక తరగతి గదులో విద్యార్థులు మాత్రమే కూర్చుండిపోవడం చూసి అయ్యో అనుకోలేదు. పోరాటం వేలు పట్టుకొని నడిచిన మనిషి కదా కాశీం.. అందుకే తెలంగాణ బిడ్డల ఉన్నత విద్య కోసం మళ్ళీ పోరాటమే మార్గమన్నాడు.
వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో సామజిక, ప్రజా ఉద్యమాలకు నెలవుగా నిలిచింది ఆర్ట్స్ కాలేజ్ . ఇప్పుడు ఆ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా విద్యార్థుల గోడును పాలకులకు వినబడేలా నినదిస్తుండు. మీ బిడ్డలు అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలి.. మా బిడ్డలకు మాత్రం ఉన్నత విద్యపై వెగటు పుట్టేలా చేస్తారా అంటూ ప్రశ్నై మండుతున్నాడు. తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. తన విద్యార్థుల భవిష్యత్ కోసం కాశీం చేస్తోన్న ఉద్యమానికి మనమంతా సంఘీభావం చెప్పాల్సిందే. లేదంటే.. భవిష్యత్ లో మన పిల్లలకు సర్కార్ చదువు మాయమైపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు గొంతు చించుకొని మాట్లాడిన ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మీ పోరాటానికి హ్యాట్సప్ కాసీం సార్…