ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. సిట్ తోనే విచారణ చేయించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సర్కార్ వాదనలు వినిపించగా ఆ వాదనను కొట్టిపారేసింది. సిట్ విచారణ రాజకీయ కోణంలో జరుగుతోందని ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది. మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను కూడా విచారించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, నలుగురు ఎమ్మెల్యేలు తప్పించుకోవడం అసాధ్యమే. బీజేపీ అగ్రనేతలను ఈ కేసులో ఇరికించాలని చూసిన కేసీఆర్.. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుండటంతో ఇరకాటంలో పడనున్నారు. ఈ కేసు సిట్ పరిధిలోనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కినా ఫాయిదా ఉండే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే కేసీఆర్ కు చిక్కులు తప్పవు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వందల కోట్లు పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో దొరికాయని మొదట ప్రకటించారు పోలీసులు. ఆ తరువాత రూపాయి కూడా చూపలేదు. ఇదంతా కేసీఆర్ డైరక్షన్ లోనే సాగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సాక్ష్యాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేశారు కేసీఆర్. ఈ అంశాన్ని హైకోర్టు ఎత్తి చూపింది. విచారణ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు కేసీఆర్ కు ఎలా చేరాయని ప్రశ్నించింది. దీంతో ఎటొచ్చి ఈ కేసు విచారణలో కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించే అవకాశం మెండుగానే ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైదరాబాద్ , సైబరాబాద్ కమిషనర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్ లను సీబీఐ విచారించనుంది. సీబీఐ విచారణలో ముందుగా నలుగురు ఎమ్మెల్యేలనూ ప్రశ్నిస్తారు. ఈ సీబీఐ విచారణపై ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో అసలేం జరుగుతుందన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.