తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అట్టడుగు వర్గాలను ఆకర్షించేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంపై విమర్శలు వస్తుండటం.. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లంటే జాగా కూడా లేదని భావించిన ప్రభుత్వం సొంత జాగా ఉన్నోల్లకు మూడు లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో 7,890కోట్లు కేటాయించారు. ఈ పథకంతో ఎన్నికల్లో లబ్ది పొందవచ్చునని సర్కార్ ఎత్తుగడగా తెలుస్తోంది.
కారు పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో సొంతిల్లు లేనివారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ ను ఎంపిక చేశారు. ఆ తరువాత రాష్ట్రమంతా డబుల్ బెడ్ రూమ్ ఇల్లంటూ చెప్పింది. కాని బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం పెద్దగా కేటాయింపులు చేసింది లేదు. మరోవైపు.. ఇళ్ళ నిర్మాణం చేపట్టినా కాంట్రాక్టర్లకు బిల్లులు అందక చాలా చోట్ల పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని చూస్తె కేంద్రం కొర్రీలు పెట్టింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ పై పేదల్లో ఆగ్రహం గూడుకట్టుకుపోయింది.
ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో వారిని శాంతపరిచేందుకు బడ్జెట్ రూపకల్పన చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు బదులుగా సొంత జాగా ఉన్నోళ్ళకు మూడు లక్షల సాయం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2000 మందికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కోటాలో 25 వేల మందికి మూడు లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. 2,63,000 మందికి 7, 890 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.