హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది హైకోర్టు డివిజన్ బెంచ్.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ 2022డిసెంబర్ 26న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు విచారణలో సిట్ విఫలమైందని..ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని..దాంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు సీఎం వద్దకు ఎలా చేరాయని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ బయటపెట్టకూడదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.
దాంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అనేక సమాలోచనల తరువాత ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ తీర్పు కేసీఆర్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ అనుకోవచ్చు.
హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఇక సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణలో నలుగురు ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నించనుంది సీబీఐ. ఎమ్మెల్యేలను ఎవరు సంప్రదించారు…? ఏమేం మాట్లాడారు..? పార్టీలో చేరితే ఎన్ని కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు..? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు..?అనే విషయాలపై పూర్తి సమాచారాన్ని రాబట్టనుంది సీబీఐ.