ఎట్టకేలకు రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. పాదయాత్ర చేసి తీరాలనుకున్న ఆయన కళ నెరవేరబోతోంది. సోమవారం నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేసేందుకు పార్టీలో రేవంత్ గత కొన్నాళ్ళుగా ఓ యుద్దమే చేశారు.
రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవడానికి పార్టీ సీనియర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రను సమర్ధించారు. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన యాత్ర వేరని… రేవంత్ చేయనున్న యాత్ర వేరని రేవంత్ పాదయాత్రను ఆపేందుకు సీనియర్లు శతవిధాల ప్రయత్నాలు చేశారు. కాని థాకరే మాత్రం విషయం ఏదైనా.. పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నేతలు నిత్యం జనాల్లో ఉండటం ముఖ్యమని తేల్చి చెప్పారు. రేవంత్ మాత్రమే కాదు.. మీరు కూడా మీకు చేతనైతే ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయండని సీనియర్లకు చెప్పేశారు. దాంతో సీనియర్లకు రేవంత్ పాదయాత్రను అడ్డుకోలేమని అర్థమైంది.
రేవంత్ యాత్ర సీతక్క ఇలాకా ములుగు నుంచి ప్రారంభమై..యాభై, అరవై నియోజకవర్గాలను చుట్టేస్తు మొదటి విడత పాదయాత్ర కొనసాగనుంది. కాని రేవంత్ మాత్రం ఒకేసారి తెలంగాణను చుట్టేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని.. ఆలోపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలంటే ఒకేసారి తెలంగాణలో పాదయాత్ర చేయాలనేది ఆయన ఆలోచన. ఈ పాదయాత్ర ఆసాంతం.. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళడం.. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించి పార్టీని తిరుగు లేని శక్తిగా మార్చాలనుకుంటున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పుడు.. వైఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో అన్నింటిని అధిగమించి రేవంత్ కూడా పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర లక్ష్యాలను జనాల్లోకి తీసుకేళ్ళెందుకు అన్ని రాష్ట్రాల్లో యాత్ర చేపట్టాలని ఏఐసీసీ సూచనలను తన పాదయాత్రకు అనువుగా మార్చుకున్నారు రేవంత్ రెడ్డి. వైఎస్సార్ పాదయాత్ర చేసి సక్సెస్ అయినట్టే.. రేవంత్ కూడా సక్సెస్ అవుతారని కాంగ్రెస్ క్యాడర్ లో అంచనాలు ఉన్నాయి. మరి ఆయన పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారో లేదో చూడాలి.