దేశంలో తొలిసారి వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాన్స్ జెండర్ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇందుకు సంబంధించి ఆ జంట ప్రకటన చేసింది.
సాధారణంగా ట్రాన్స్ జెండర్స్ కు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కాని ఓ ట్రాన్స్ జెండర్ జంట మాత్రం తాము తల్లిదండ్రులం కాబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేశారు. దేశంలోనే మొదటిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇది నమ్మశక్యంగా లేకున్నా కేరళలోని కోజికోడ్ లో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ జంట ఈ విషయాన్ని వెల్లడించింది.
వచ్చే నెలలో లోకానికి తమ బిడ్డను పరిచయం చేస్తామని మహిళగా పుట్టి పురుషుడిగా మారిన జహాత్ , పురుషుడిగా పుట్టి మహిళగా మారిన జియా పావల్ ప్రకటించారు. వీరిద్దరూ గత మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇందుకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫొటోలను నెటిజెన్లతో పంచుకున్నారు.
పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన జియా తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను, తన శరీరం పుట్టుకతో స్త్రీ కానప్పటికీ ఒక బిడ్డ తనను అమ్మ అని పిలుస్తుందని, ఒక బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవాలనేది తన కల అని పేర్కొన్నారు. తాను తల్లి కావాలని ఏ విధంగా అయితే కలలు కంటున్నానో, జహాత్ కూడా తండ్రి కావాలని కలలు కంటున్నాడని తెలిపింది. తామిద్దరి సమ్మతితో తాను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించారు.
అయితే స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ట్రాన్స్ జెండర్‌కు గర్భం ఏ విధంగా సాధ్యమవుతుందని అందరిలో సహజంగానే ప్రశ్న రేకెత్తుతోంది. అయితే ట్రాన్స్ జెండర్‌గా మారిన సమయంలో చేయించుకున్న శస్త్ర చికిత్సలో గర్భాశయాన్ని, తొలగించకపోవడంతో ప్రస్తుతం అతను గర్భవతయ్యాడు.