ఈటల రాజేందర్ సొంత గూటికి వెళ్ళే అవకాశం ఉందా..? బీజేపీలో ఇమడలేకపోతున్న ఆయన బీఆర్ఎస్ ఆహ్వానం అందితే తిరిగి వెళ్తారా..? అంటే.. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ , ఈటల మధ్య సంబాషణ చూసిన వారంతా అవుననే అంటున్నారు.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్చీఫ్ లు మార్చేసినంత ఈజీగా పార్టీలను మార్చేస్తున్నారు నేతలు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ పక్క చూపులు చూస్తున్నారు. కీలక నేతలకు ప్రధాన పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జాతీయ స్థాయి పార్టీగా మారిన నేపథ్యంలో పాత మిత్రులను మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, పల్లె రవి వంటి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కాబట్టి కీలక నేతలను లాగేసుకోవాలని అధికార బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ లో అసంతృప్త సెగలు రాజుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించాలనే నేతలను బతిమాలడం బదులుగా.. గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి తీసుకురావడం ఈజీ అనే అంచనాకు బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరిన వారు అక్కడ అసంతృప్తిగా ఉన్నారు. దాంతో బీఆర్ఎస్ మాజీ నేతలను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయి పార్టీగా మార్చాక మీ అవసరం ఉందంటూ వారికీ ఆహ్వానం పంపుతున్నారు. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు.
వలసలపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఓపెన్ గానే ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే శాసన సభ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటలను మంత్రి కేటీఆర్ ప్రేమ పూర్వకంగా పలకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లాబీలో కేటీఆర్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో రెండుసార్లు ప్రత్యేకంగా మాటామంతి జరిపారు. ఇక వీరి మధ్య జమ్మికుంటలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని కేటీఆర్ ఈటల రాజేందర్ ను ప్రశ్నించగా.. పిలిస్తే కదా హాజరయ్యేది అని ఈటల జవాబిచ్చారు. ఈ క్రమంలో గవర్నర్ సభలోకి వస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమాచారం ఇవ్వడంతో కేటీఆర్ ఈటెల మధ్య మాట మంతీ ముగిసింది. ఆతరువాత కూడా ఈటలను పలుమార్లు ప్రశంసించడం జరిగింది. ఇదంతా ఈటలను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో జరుగుతున్న తంతు ఇదేనని అంటున్నారు.
ఈటెల, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈటలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ పై తీవ్రస్థాయిలో శివాలెత్తుతోన్న ఈటలను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించడంతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. కేటీఆర్ స్వయంగా రాజేందర్ దగ్గరికి వెళ్లడం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన భారత రాష్ట్ర సమితిలోకి వెళ్తారని కొందరు…అంత అవమానం జరిగిన తర్వాత మళ్లీ ఎందుకు వెళ్తారని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటామంతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.