సమాజంలో ఆడవారికే కాదు మగవారికీ కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ మధ్య మగవారి మీద ఆడవారు దాడులకు పాల్పడుతోన్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మగ మహానుభావులు వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ నటుడి ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది.
తమిళ నటుడు, డ్యాన్సర్ రమేష్ జనవరి 27వ తేదీన తన బర్త్ డే రోజునే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. రమేష్ రెండో భార్య వేధింపుల వలెనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపించింది. రమేష్ ను రెండో భార్య విపరీతంగా వేధించేదని.. ఆ వేధింపులను భరించలేకే బలవన్మరణం చేసుకున్నాడని ఆరోపించింది.
ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో రెండో భార్య రమేష్ ను దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కర్రతో అతడిని చితకబాదినట్లు కనిపిస్తోంది. తనను కొట్టవద్దని రమేష్ వేడుకుంటుండగా రెండో భార్య, కూతురు చచ్చిపోమని శాపనార్థాలు పెట్టడం వినిపించింది.
రెండో భార్య పెట్టె హింసను తట్టుకోలేక రమేష్ తల్లడిల్లడం కనిపించింది. దీనికి ‘ఉరితాడు తీసుకురమ్మంటావా?’ అని కూతురు అనడం వీడియోలో కనిపించింది. వీడియో చివర్లో సోఫా మీద రెండో భార్య కట్టెతో కూర్చొని ఉండటం స్పష్టంగా కనిపించింది. నిజంగానే రెండో భార్య వేధింపులతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి.
కాగా టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్, తర్వాత రియాల్టీ షోలో అవకాశం, తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందాడు. కాగా అజిత్ తునివులో, రజినీకాంత్ జైలర్ లో కూడా నటించాడు.