2018ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ చాలానే హామీలు ఇచ్చారు. కేసీఆర్ ను నమ్మి జనాలు రెండోసారి అధికారం కట్టబెట్టారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చుతామంటూ గత బడ్జెట్ లో నిధులు కేటాయించారు కాని విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఆ హామీలే కేసీఆర్ సర్కార్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
రైతు రుణమాఫీ :
రైతును రాజు చేస్తామని.. తమకు మరోసారి అవకాశం ఇస్తే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ రైతులను తనవైపు తిప్పుకున్నారు. కేసీఆర్ ను నమ్మి రైతులంతా ఏకపక్షంగా కారు గుర్తుకు ఓటేశారు. నాలుగేళ్ళు అవుతున్నా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. ఇందుకోసం 24,738కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. కాని ఇప్పటి వరకు కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.రుణమాఫీ కాకపోవడంతో వందలాది మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దళిత బంధు :
2022 -23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో చూపించారు. కాని వాటిని ఖర్చు చేయలేదు. అందరికీ దళిత బంధు ఇస్తామని చెబుతున్నా బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు పథకం అందుతోందని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నాటికీ ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోతే దళితుల నుంచి బీఆర్ఎస్ కు కొంత ప్రతిఘటన తప్పదు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ ఈ బంధు పథకం వర్తింపజేయాల్సి ఉంది. లేదంటే.. ఈ దళిత బంధు అందుకోని వారి ఓట్లు చేజారిపోయే అవకాశం మెండుగా ఉంది.
మూడు లక్షల సాయం :
సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గత బడ్జెట్ సమయంలో ప్రకటించారు. గతేడాది పాలమూరు సభలో కేసీఆర్ మాట్లాడుతూ. పదిహేను రోజుల్లో అర్హులైన వారి అకౌంట్లలో డబ్బులు పడుతాయని ప్రకటించారు. కాని ఇంతవరకు ఏ ఒక్కరి ఖాతాలో డబ్బులు జమా కాలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇవ్వలేకే సొంత జాగా ఉన్నోళ్ళకు సాయమంటూ కొత్త ప్రకటన చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల వరకైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయని చాలామందే ఆశలు పెట్టుకున్నారు. అటు సొంత జాగా ఉన్నోళ్ళు కూడా మూడు లక్షల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చకపోతే బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవు.
నిరుద్యోగ భృతి :
ఇంటికో ఉద్యోగమని ఉద్యమ కాలంలో చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా నిరుద్యోగుల్లో కేసీఆర్ మొదటి దఫా పాలనపై తీవ్ర అసంతృప్తి కూడగట్టుకుంది. దాంతో నిరుద్యోగ యువతను సంతృప్తి పరిచేందుకుగాను నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కాని ఇప్పటికీ వరకు ఆ హామీ ఊసే లేదు. బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ఈ హామీని నెరవేర్చకుండా ఎన్నికల్లోకి వెళ్తే నిరుద్యోగ యువత నుంచి చేదు ఫలితం ఎదుర్కోకతప్పదు.
గొర్రెల పెంపకం :
గొర్రెల పెంపకం దార్లకు యూనిట్లు ఇస్తామని వారి దగ్గర కొంత సొమ్ము చెల్లించుకున్నా ఇవ్వలేదు. ఇలాంటి పథకాలు .. ప్రజలపై నేరుగా చూపే పథకాలకు కూడా కేసీఆర్ నిధులు కేటాయించలేకపోతున్నారు. ఎన్నికల బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించడమే కాదు.. ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే కేసీఆర్‌కు అతి పెద్ద సవాల్ అనుకోవచ్చు.
Also Read : నాలుక తడారిందా కేసీఆర్.. బీజేపీపై నాటి గర్జన ఏమైంది..?