బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున్న బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఉంటాయని అంచనా వేశారు. కానీ అవి అంచనాలకే పరిమితమయ్యాయి తప్పితే ఆచరణ రూపం దాల్చలేదు.
బడ్జెట్ లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే నిధులు కేటాయించారు. సింగరేణికి రూ. 1650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ రూ. 300 కోట్లు కేటాయించారు.ఇక , అన్ని ఎయిమ్స్ ఆసుపత్రులకు కలిపి కేటాయించిన వాటిలో కొన్ని మామూలుగానే తెలంగాణ, ఏపీ ఎయిమ్స్ లకు వస్తాయ్. కానీ ప్రత్యేకంగా కేంద్రం ఏమి కేటాయించలేదు.
ఇక, ఏపీని కూడా నిర్మలమ్మ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 47 కోట్లు, పెట్రోలియం వర్సిటీకి రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 683 కోట్లు కేటాయించారు. దాంతోనే కేంద్రం చేతులు దులిపేసుకుంది తప్పితే ఏపీపై పెద్దగా కరుణ చూపలేదు. విశాఖ రైల్వే జోన్ , పోలవరం ప్రస్తావన అసలే తేలేదు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకపై బడ్జెట్ లో ప్రేమ చూపింది కేంద్రం. అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5300 కోట్లు కేటాయించింది. 29. 4 టీఎంసిల సామర్ఢ్యముతో 2. 25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జాతీయ ప్రాజెక్టు అయినా పోలవరానికి పైసా ఇవ్వలేదు. అలాగే కాళేశ్వరానికి జాతీయుల హోదా కల్పించాలని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా చెవిన పెట్టలేదు. కానీ కర్ణాటకపై మాత్రం కరుణ చూపడం విశేషం.
గత ఏడాది బడ్జెట్ పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రం వైఖరిపై కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వాయించారు. ఈసారి బడ్జెట్ పై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
ఇక ఏపీ ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోని కొన్ని రంగాలకు కేటాయింపు భేష్ అంటూ కితాబిచ్చారు. ఏపీ సర్కార్ అంటే కేంద్రంతో సఖ్యత ఉంటుంది కాబట్టి రియాక్ట్ కావడంలేదు కానీ బీజేపీపై సమరభేరి అని ప్రకటనలు చేస్తోన్న కేసీఆర్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.