తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కేటీఆర్ క్లిష్టమైన నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా ఈటలను ఓడించాలనుకుంటున్న ఆ పార్టీ పెద్దలు.. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ అభ్యర్థి ఎవరో అప్పుడే ప్రకటించేశారు. హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్ అనౌన్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కౌశిక్ రెడ్డికి సూచించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలపై ఓయూ విద్యార్ధి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయగా.. తాజాగా ఆయన సమక్షంలోనే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని.. కౌశిక్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరనీ కేటీఆర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. అయితే.. అదంతా ఈటల పార్టీలో ఉన్నప్పుడు. ఆయన పార్టీ మారాక అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా గెలుపొంది నేరుగా కేసీఆర్ నే సవాల్ చేస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉప ఎన్నికల్లో ఈటలపై బీసీ సామజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస యాదవ్ ను బరిలో నిలిపారు బీఆర్ఎస్ అధినేత. బీసీ అభ్యర్థి కావడంతో ఈటలపై ఆయనైతేనే ఓడించగలమని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనే అభ్యర్థినని ప్రకటించుకున్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. విద్యార్ధి నేత, ఉద్యమ నేతగా తనకే అవకాశం ఇస్తారని చెప్పుకున్నారు. ఇంతలోనే పాడి కౌశిక్ రెడ్డి పేరు కేటీఆర్ ప్రతిపాదించి గెల్లు శ్రీనివాస్ కు షాక్ ఇచ్చారు.
Also Read : హుజురాబాద్ టీఆర్ఎస్ : పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్