బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సంతకం చేయకుండా హోల్డ్ లో పెట్టిన బడ్జెట్ ఫైల్ పై సంతకం చేశారు. గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామనే సర్కార్ ప్రకటనతో ఫిబ్రవరి మూడో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టె అవకాశం లేదు. రెండు రోజుల తరువాత ఫిబ్రవరి 6న బడ్జెట్ ను ప్రవేశపెట్టె చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
గవర్నర్ ప్రసంగంతో సంబంధం లేకుండా సభ సమావేశాలను నిర్వహించేందుకు మూడో సెషన్లను ప్రోరోగ్ చేయలేదు. ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ గత సమావేశాలకు కొనసాగింపుగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణం చూపే గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. గత ఏడాది కూడా ఇదే వాదనను వెలిబుచ్చారు. ఇప్పుడు మాత్రం హైకోర్టుకు వెళ్లి ఇరకాటంలో పడిన ప్రభుత్వం… గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలిపింది.
గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు చెప్పడంతో మళ్ళీ ప్రోరోగ్ చేసి సమావేశాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ అందుకు సిద్దపడితే సభ సమావేశాలను ఓ వారం రోజులపాటు సభను వాయిదా వేయాల్సి ఉంటుంది. అలా వద్దని సర్కార్ అనుకుంటే… గత ఏడాది తప్పు చేసినట్లు అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని మూడో తేదీనే ఏర్పాటు చేస్తే.. ఆ రోజు ప్రవేశపెట్టాలనుకున్న బడ్జెట్ వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. దీనికే సర్కార్ మొగ్గు చూపుతోంది.