తెలంగాణ బీజేపీలోకి చేరికలు భారీ ఎత్తున ఉంటాయని..ఊహించని నేతలు పార్టీలో చేరుతారని డంఖా బజాయించుకొని చెప్పుకున్నారు. చేరికల సంగతి దేవుడెరుగు..ఉన్న నేతలే బీజేపీని వీడే పరిస్థితులు కనిపించడంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీని ఎవరూ వీడోద్దని.. బీజేపీని వీడిన నేతలు తిరిగి రావాలని సందేశం వినిపిస్తున్నారు బండి సంజయ్. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది.
తెలంగాణ బీజేపీలోని అంతర్గత కలహాలను రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో అసంతృప్త నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈటల, వివేక్ , జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల లక్ష్యం బీజేపీలో ఉంటె నెరవేరదని…వారికీ సరైన వేదిక కాంగ్రెస్ మాత్రమేనని సందేశం పంపుతున్నారు. వాస్తవానికి.. వీరంతా బీజేపీలో ప్రాధాన్యత లేకుండా కొనసాగుతున్నారు. దాంతో వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రాజకీయ వ్యూహాలతో బీజేపీలో ఆందోళన మొదలైంది. అందుకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా ఇన్నాళ్ళు పక్కనపెట్టిన విజయశాంతిని బండి సంజయ్ ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. విజయశాంతికి ప్రియార్టి ఇవ్వడం లేదన్న భావనను తుడిచి వేసేందుకే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గోనట్టు తెలుస్తోంది.
విజయశాంతి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ కామెంట్స్ లో నిర్వేదం కనిపించింది. పార్టీని ఎవరూ వీడోద్దని.. ఆయా పార్టీలో ఉన్న నేతలు బీజేపీలో చేరాలంటూ కోరారు. అసలే పార్టీలోకి చేరికలు లేకపోగా.. ఉన్న నేతలు పార్టీని వీడితే ఇన్నాళ్లు పెంచుకున్న హైప్ కోల్పోతామని భావనతో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేసినట్టు అర్థం అవుతోంది.