ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆందోళన బాట పట్టింది. కరెంట్ కోతలను నిరసిస్తూ విద్యుత్ సబ్ స్టేషన్ లను ముట్టడించింది. అంతరాయం లేకుండా కరెంట్ ను సరఫరా చేయాలంటూ కంటిన్యూగా ఆందోళన చేస్తున్నారు రైతులు.
అప్రకటిత కరెంట్ కోతలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దాంతో మొదట జనగామ రైతులు ఆందోళన బాట పట్టారు ఆ తరువాత వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామం, నల్లబెల్లి రైతులు కూడా మేము సైతం అంటూ ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు విదిస్తుండటంతో రైతులు ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఓ వైపు ప్రభుత్వం 24గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెబుతోంది. కాని రోజుకు ఐదు గంటలకు మించి కూడా కరెంట్ ఉండటం లేదని రైతులు విద్యుత్ అధికారులను నిలదీస్తున్నారు.
అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు పూర్తిగా పంటపొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో..? ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియక రైతులు పొలాలకే పరిమితం అవుతున్న పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులను కూడా వాయిదా వేసుకుంటూ కరెంట్ ఎప్పుడు వస్తుందోనని పడిగాపులు కాస్తున్నారు. ఎండ, చలిని తట్టుకుంటూ ఇంటికి దూరమై మడిగట్లలోనే మకాం వేస్తున్నామని చెప్తున్నారు.
మరోవైపు.. కరెంట్ కోతలను నివారించకపోతే రైతులంతా కలిసి స్థానిక ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించాలని నిర్ణయించారు. ఇందుకోసం సమిష్టిగా ఉద్యమించాలని లేదంటే కరెంట్ కోతల వలన పంటలు ఎండిపోతాయని రైతులు భావిస్తున్నారు. రైతుల వరుస ఆందోళనలతో ఎమ్మెల్యేలో కూడా భయం పట్టుకుంది. విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు.