తెలంగాణ గవర్నర్ తమిళి సై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ సర్కార్ పై వెనక్కి తగ్గేదేలే అని గవర్నర్ అనుకుంటున్నారు. అందుకే ఆమె టీవీ డిబేట్లకు కూడా వెళ్తున్నారు. సర్కార్ ను కడిగేస్తున్నారు. నేరుగా విమర్శలు చేస్తున్నారు. మహిళా గవర్నర్ పై వివక్ష ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతి విమర్శలు చేసేలా చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎఎస్ నేతలు సందేహిస్తున్నారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెడుతున్నారని ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె రాజకీయ విమర్శలు చేయడం ప్రభుత్వ పెద్దలకు అస్సలు రుచించడం లేదు. ఆమె ఇలా రాజకీయ విమర్శలు చేసే స్థాయికి చేరుకున్నారంటే.. ప్రభుత్వం ఆమెను ఎంతగా ఇబ్బంది పెడుతుందోననే అభిప్రాయం సహజంగానే జనాల్లో ఏర్పడుతోంది. తన విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ పదేపదే విమర్శలు చేస్తున్నారు.
రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ప్రోటోకాల్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాజ్యాంగబద్దంగా ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను సర్కార్ ఇచ్చి ఉంటె బీఆర్ఎస్ సర్కార్ పై ఎలాంటి అపవాదు ఉండకపోయేది. అప్పుడు గవర్నర్ వైఖరినే అందరూ ఎత్తిచూపేవారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నెలలకు నెలలుగా ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని.. ఆమె రాజకీయ అంశాల్లో తలదూర్చుతున్నారని జనాల్లోకి సంకేతం వెళ్ళేది. కాని బీఆర్ఎస్ సర్కార్ గవర్నర్ కు పోటీగా రాజకీయం చేసి తను చులకన అయింది.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని.. వీటిపై కేంద్రానికి నివేదిక పంపానని గవర్నర్ ప్రకటించారు. ఈ నివేదికపై కేంద్రం సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. వీటిని చూపి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నా..షెడ్యూల్ మేరకు ఎన్నికలు వచ్చిన తరువాతైనా రాష్ట్రపతి పాలన విధిస్తే కేసీఆర్ కు ఇబ్బందే.
అయితే… కేసీఆర్ ను ఇలాంటి చిక్కుల్లో వేసేందుకే గవర్నర్ తో బీజేపీ ఈ తరహ రాజకీయం చేయిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ తరహ రాజకీయమే బీజేపీ చేయించినట్లైతే బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ పడినట్లే లెక్క.