తెలంగాణ ప్రజలను కేసీఆర్ నమ్మించి గొంతు కొసిండని విమర్శించారు నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని తూర్పారబట్టారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్న వంశీకృష్ణ.. కేసీఆర్ ను పూర్తిస్థాయిలో ఫామ్ హౌజ్ కు పరిమితం చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండలం రామచంద్ర పురంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను లాంఛనంగా ప్రారంభించారు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు డా.మల్లు రవితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఇంటికో ఉద్యోగం, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లంటూ పేదలను కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడం చేతకాక.. సొంత జాగ ఉనోళ్ళకు మూడు లక్షల ఆర్ధిక సాయమని మూడు నెలలు నుంచి కాలయాపన చేస్తున్నారని వంశీకృష్ణ విమర్శించారు.
ఈ యాత్ర రామచంద్రపురం నుంచి శిరసనగండ్లకు చేరుకున్నాక.. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి హత్ సే హత్ జోడో యాత్ర కరపత్రాలను విడుదల చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని వంశీకృష్ణ మండిపడ్డారు.
పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా…రైతు చనిపోతే డబ్బులిస్తాడట అంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ధరణి దరిద్రం పోవాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ కేసీఆర్ పోయినా ఆగదని, అంతకు అంతకు కలిపి ఆ కళ్యాణ లక్ష్మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా పెన్షన్ ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.