వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలిపేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోందా..? ఇందిరాగాంధీ నడయాడిన నేలపై ప్రియాంక గాంధీని పోటీలో నిలిపి సెంటిమెంట్ ను పునరావృతం చేయాలనుకుంటుందా..? ప్రియాంకను మెదక్ నుంచి పోటీ చేయించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది.
1980లో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ రెండు లక్షల మెజార్టీతో గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఆమె హయంలోనే మెదక్ పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. నాన్నమ్మ నడయాడిన నేలపై ఇప్పుడు మనవరాలు ప్రియాంక గాంధీని బరిలో నిలిపేందుకు టీపీసీసీ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవాలంటే మెదక్ నుంచి ప్రియాంకను బరిలో నిలడమే అత్యుత్తమని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈమేరకు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు టీపీసీసీ ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపట్టనున్న “యాత్ర” ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఆమె వచ్చాక ప్రియాంకతో ఈ విషయమై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మెదక్ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలిపేందుకు రాహుల్ గాంధీ కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. భారత్ జోడో యాత్ర మెదక్ జిల్లాలో సాగిన సమయంలో యాత్ర విజయవంతానికి రాహుల్, ప్రియాంక సేనా జాతీయ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గాలి అనిల్ తోపాటు పలువురు నేతలు తీవ్రంగా కృషి చేశారు. పార్టీ క్యాడర్ కూడా ఈ యాత్రకు బ్రహ్మరథం పట్టింది. ఇందిరా గాంధీ ప్రధాని అయ్యాకే మెదక్ ను ఎంతో అభివృద్ధి చేశారని జోడో యాత్రలో రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇందుకు జనం నుంచి కూడా అదే స్పందన లభించింది. జిల్లాలో కాంగ్రెస్ ఇంకా బలీయంగానే ఉందని జోడో యాత్ర సమయంలో రాహుల్ కు అర్థమైంది. దీంతో ప్రియాంకను మెదక్ నుంచి పోటీ చేసే విషయంలో రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. ఫైనల్ గా సోనియా గాంధీ, ఖర్గేలు అంగీకరిస్తే ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉంటుంది. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీలో ఉండటం వలన రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన గాలి అనిల్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఆయనపై అనేక ఒత్తిళ్ళు వచ్చినా వాటన్నింటిని ఎదుర్కొని పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉంటు వస్తున్నారు. పార్టీ నిర్వహించిన సీక్రెట్ సర్వేలో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గడిచిన కొంతకాలంగా మరింత స్ట్రాంగ్ అయిందని తేలింది. ఇందులో గాలి అనిల్ మార్క్ ఉందని తేలడంతో మెదక్ ఈసారి గాలి అనిల్ దేనని అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రియాంక గాంధీని మెదక్ నుంచి పోటీ చేస్తే గాలి అనిల్ పరిస్థితి ఏంటని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గాలి అనిల్ కుమార్ ను సంప్రదించగా.. ప్రియాంక గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే తాను రేసు నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పినట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. అదే సమయంలో..కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా కొనసాగుతున్న గాలి అనిల్ కుమార్ కు పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.