రిపబ్లిక్ డే నిర్వహణ విషయంలో గవర్నర్ , తెలంగాణ సర్కార్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరేడ్ తో రిపబ్లిక్ డే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోపాటు గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండటంతో సీన్ గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లు మారింది.
తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. తెలంగాణలో జెండా వందనం ఆవిష్కరణ అనంతరం పుదుచ్చేరి వెళ్ళిన గవర్నర్ అక్కడి తమిళ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. కరోనా సాకుతో గణతంత్ర వేడుకలకు సర్కార్ అనుమతి ఇవ్వలేదని.. ఖమ్మంలో ఐదు లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారని తమిళిసై గుర్తు చేశారు. వీటన్నింటిపై కేంద్రానికి నివేదిక పంపానన్నారు.
హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లోనూ గవర్నర్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌజ్ ల గురించి మాట్లాడారు. ఫామ్ హౌజ్ లు కాదు ప్రజలకు కావాల్సింది. ఫామ్ లు , హౌజ్ లు కావాలని కేసీఆర్ కు చురకలంటించారు. కొత్త బిల్డింగ్ లు కడితే అభివృద్ధి అయిపోదని.. రాష్ట్రంలో రోజూ 22మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతివిమర్శలు చేస్తున్నారు.
అయితే.. హైకోర్టు ఆదేశాలను సర్కార్ ఖాతరు చేయకపోవడం.. రాజ్యాంగపరంగా నిర్వర్తించాల్సిన విధులను ప్రభుత్వం నిర్వహించడం లేదని తమిళిసై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె కేంద్రానికి నివేదిక పంపానని పెర్కొనటం చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కేంద్రం సీరియస్గా తీసుకుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.