ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తోందని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అన్ని స్థానాల్లో బరిలో ఉంటామని ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మణి నాయుడు స్పష్టం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏపీపై దృష్టిసారించారని.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను ఆప్ భర్తీ చేస్తోందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా ఆప్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 9 నెలలుగా అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్న మణినాయుడు.. ఇతర పార్టీల నుంచి నేతలు, సామాజిక కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. రోజు రోజుకు పార్టీ బలం పెరుగుతుందన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రతీ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఏపీలో తామూ పోటీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రకటించగా.. తాజాగా ఆప్ కూడా ఇదే ప్రకటన చేయడం గమనార్హం. కేసీఆర్ తో అరవింద్ కేజ్రీవాల్ సఖ్యతగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి, ఖమ్మం సభకు ఆయన హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాయని కేసీఆర్ అంటున్నారు. ఇదే సమయంలో ఏపీలో తాము పోటీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించగానే…ఆప్ నేతలు కూడా బరిలో ఉంటామని చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది.
బీఆర్ఎస్ , ఆప్ నేతల ప్రకటలు వ్యూహత్మకమేనని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను చీల్చేందుకు రెండు పార్టీలు పోటీ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే..ఏపీలో జగన్ సర్కార్ పై భారీగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా పొత్తులతో వెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పొరపాటున జనసేన కూడా టీడీపీతో కలిసి వెళ్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దీంతో కేసీఆర్ అంతరంగిక స్నేహితుడు జగన్ కు ఫేవర్ చేసేందుకే ఆప్ పై ఒత్తిడి తీసుకొచ్చి..ఆప్ ను సైతం ఏపీ ఎన్నికల బరిలో నిలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.