ఒడిశాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాద్యక్షుడు జేపీ. నడ్డాకు పంపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు ఇటీవలే వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి వెళ్ళారు. తాజాగా పార్టీకి రాజీనామా చేయడంతో గమాంగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గిరిధర్ గమాంగ్ బీజేపీలో చేరారు. పార్టీలో కీలక బాద్యతలు నిర్వర్తించారు. బీజేపీలో తన కుమారుడిని అవమానించారని అందుకే బీజేపీతో అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమను కావాలనే పార్టీలో పక్కకు పెట్టి అవమానించారన్నారు. బీజేపీలో ఇంతకాలం సహకరించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ పార్టీలో చేరనున్నామనే విషయాన్ని గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. త్వరలోనే జాతీయ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ జాతీయ పార్టీ ఎదో కాదు. బీఆర్ఎస్సే.
ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్‌కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ ఒడిశా నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు.