జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేక పదవి నుంచి తప్పుకుంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా ఉందంటూ గోడును వెళ్లబోసుకున్నారు.
తమను డబ్బుల కోసం ఎమ్మెల్యే గత కాలంగా వేధిస్తున్నారని.. అడిగినంత ఇవ్వకపోతే పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ సంజయ్ బెదిరించారని శ్రావణి ఆరోపించారు. బీసీ బిడ్డగా తన ఎదుగుదలను ఓర్వలేక దొరా అహంకారంతో కక్ష కట్టారన్నారు. అభివృద్ధి పనులకు పదేపదే అడ్డొస్తూ..సమాచారం లేకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా.. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానని చెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వేధింపులు తీవ్రతరం కావడంతో భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నదంటూ అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది శ్రావణి. మున్సిపల్ చైర్మన్ గా తనను ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల కోసం అధికారులను కలిస్తే ఎవరిని కలవోద్దని ఎమ్మెల్యే ఆంక్షలు విధించినట్లు చెప్పారు. నీ స్థాయికి కలెక్టర్ ను కలుస్తావా..? అని అవమానించాడని శ్రావణి వాపోయింది. పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. కవితను కలవకూడదు. కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని ఎమ్మెల్యే ఆదేశించారన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే సంజయ్ కుమారే బాధ్యత వహించాలన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మీడియా సమావేశం ద్వారా జిల్లా ఎస్పీని వేడుకున్నారు. ప్రస్తుతానికి పదవికి మాత్రమె రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.