ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటిసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలంటూ నోటిసులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇటీవలే సీబీఐ నోటిసులు జారీ చేయగా ఈరోజు నోటిసు ఇచ్చి రేపు రమ్మంటే ఎలా వెళ్తామని.. ఐదు రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. తాజాగా నోటిసులు ఇచ్చిన సీబీఐ అవినాష్ రెడ్డి కోరినట్లుగానే ఐదు రోజుల తరువాతే విచారణకు హాజరు కావాలని సూచించింది. దాంతో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. ఆయనకు మరో మార్గమే లేదు. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరావ్వాలన్న సాకు చూపి విచారణకు డుమ్మా కొట్టే అవకాశం కూడా లేదు. ఐదు రోజుల తరువాత సీబీఐ నోటిసులు ఇస్తే ఇదే కారణం చెప్పి తప్పించుకునేందుకు అవకాశం ఉండేది. కాని సీబీఐ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందుగానే నోటిసులు ఇచ్చింది. అయితే.. విచారణకు హాజరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమోనని ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
సీబీఐ అరెస్ట్ కు మొగ్గు చూపితే అలా అన్నదానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్యా కేసు విచారణ హైదరాబాద్ కు బదిలీ కావడంతో ఇక నుంచి అన్ని హైదరాబాద్ కేంద్రంగానే అన్ని జరుగుతాయి. నిందితుల్ని కూడా హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.