తెలంగాణతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామ ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ జతీయ స్థాయి పార్టీ మారాక ఆ ప్రాంతాలపై కేసీఆర్ దృష్టి సారించడం స్టార్ట్ చేశారు.
తెలంగాణలో తమ గ్రామాలను విలీనం చేయాలని ప్రజల డిమాండ్ దృష్ట్యా అక్కడ పార్టీ విస్తరణకు ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు కేసీఆర్. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీని ఆశీర్వదిస్తే తెలంగాణ తరహ అభివృద్ధిని పరిచయం చేస్తామని చెప్పదల్చుకుంటున్నారు. ఇందులో భాగంగా నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ తోపాటు మంత్రులు, స్థానిక నేతలు హాజరు కానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే నాందేడ్ లో బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా పర్యటించి..పార్టీలో చేరేలా కొంతమంది స్థానిక నేతలను ఒప్పించారు. వారిని పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ కు ఇతర రాష్ట్రాల్లో ఆదరణ లభిస్తుందని ప్రచారం చేసుకోనున్నారు.
సభా ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్‌చార్జిలుగా నియమించారు. కేసీఆర్ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. మొత్తానికి పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతోంది.
పార్టీ విస్తరణ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే పోటీ చేసేందుకు కేసీఆర్ ఆసక్తి కనబరచడం లేదు. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నా..ఇంత తక్కువ సమయంలో ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.