అధికారిక కార్యక్రమాల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై తో వేదిక పంచుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తే గవర్నర్ తో వేదిక పంచుకోవాల్సి వస్తుందని.. ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర వేడుకలపై ఇప్పటికీ రాజ్ భవన్ కు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఏడాది కూడా ప్రగతి భవన్, రాజ్ భవన్ లో వేర్వేరుగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి.
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి.. ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. కాని గణతంత్ర దినోత్సవాన్ని మాత్రం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు కారణం.. గవర్నర్ తమిళిసై జెండా ఎగరేసి.. ప్రసంగించాల్సి రావడమే.
తమిళిసై గవర్నర్ గా వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆమె వచ్చిన తరువాత పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతున్నారని కేసీఆర్ గవర్నర్ పై ఆగ్రహంగా ఉన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్ భవన్ లోనే గవర్నర్ జెండా ఎగరేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే జెండా ఎగురవేశారు. ఈ ఏడాది కూడా అంతే. ఈ సారి కూడా రాజ్ భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అంటే.. గతేడాది లాగే నిర్వహించనున్నారని అర్థం అవుతుంది.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాజ్ భవన్ తో సంబంధాలు దెబ్బతినడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.