చేగువేరా బిడ్డ అలైదా గువేరా హైదరాబాద్ వస్తోందని తెలిసి అంతగొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళ లో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని కిక్కిరిసిన రవీంద్ర భారతి లో ఒంటికాలు మీద నిలబడి ఒక్క సారి ఆమెను చూసి బయట పడ్డా..
ఐరిష్ మూలాలున్న చే కుటుంబ లాటిన్ అమెరికా లో స్థిరపడ్డ మెడికో ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన చే రష్యన్ విప్లవం విజయవంతం అయిన పదేళ్లకు పుట్టాడు. యాబయ్యో దశకం లో మొదలైన అలజడులు చూసి పెరిగి వాటికి ఆకర్షితు డై క్యూబన్ విప్లవాన్ని ఆవహించుకుని బొలీవియన్ విప్లవం లో హంతక సి ఐ ఎ చేతిలో హత్యకు గురై అమరుడు అయ్యాడు. క్యూబా పెట్టుబడిదారీ సమాజ శవపేటికకు మేకులు కొడదాం అనుకున్నది. అలా కొడదాం అనుకున్న చేగువేరా బొమ్మను కూడా మార్కెట్ చేసుకుంది సామ్రాజ్యవాదం. అదీ పెట్టుబడికి ఉన్న శక్తి చే ప్రవహించే ఉత్తుంగ తరంగం కోట్లాది మందికి ప్రత్యామ్నాయ ఆలోచనలు కలగన్న వాళ్లకు చీకట్లో చిరు ప్రమిద. ఏదో పని మీద ఆమె ఇండియా వచ్చింది మొన్న పద్దెనిమిది నాడు మద్రాస్ సీపీఎం ఒక మీటింగ్ పెట్టింది ఇవ్వాళ తెలంగాణ రేపు బ్రమరావతి లో .ఇవ్వాళ మీటింగ్ లో క్యూబా సాలిడారిటీ కమిటీ అనే బ్యానర్ చూసి నవ్వుకున్నా.
ప్రపంచానికి సామ్రాజ్యా వాద వ్యతిరేక పోరాటాన్ని ఎలా నడపాలో చెప్పిన క్యూబా ,వర్గపోరాటం విలువ నేర్పిన క్యూబా. కోవిడ్ కాలం లో ప్రపంచానికి సుస్థి చేస్తే ఆపన్న హస్తం అందించిన క్యూబా. ఎప్పటికీ వంచిత కాదు. అది నిలువెత్తు స్వాభినామ చిహ్నం మీ నుంచి ఏం నేర్చుకుంటది బాస్. వేదిక మీద ఉన్న మొనగాళ్ల నుండి సాలిడారిటీ ఆశిస్తోందా అందునా ఒక వైపు అమెరికా సామ్రాజ్య వాదం నశించాలి అంటూ మరో వైపు తమ పిల్లలు అమెరికలో చదువు కోవాలి. చే బిడ్డ మీటింగ్ లో దళారి అమెరికా ను తిట్టాలి.
ఏమిరా బాలరాజులూ మీ వల్ల ఈ దేశానికి ఒరిగింది ?
నీ ముందు ఎర్రజెండా త్యాగం గురించి మాట్లాడాలి , వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ బిచ్చం వేసే ఒకటి రెండు సీట్ల కోసం దేబిరించాలి. అదే ఇండియన్ కుల తార్కిక భౌతిక వాదం.
.నువ్వొక మాట అన్నావే ‘ఒక క్యూబన్‌గా చెప్పాలంటే, మేము పేదోళ్ళలా బతుకుతుంటాం. కానీ సంపన్నవంతులుగా చనిపోతాం.”
మా కమ్యూనిస్ట్ లు కూడా అత్యంత పేదోళ్ళ లాగా పైకి కనపడతారు. వాళ్ళ పిల్లలకు మాత్రం వందల వేల కోట్ల రూపాయలు తమ పలుకు బడితో పోగేసి పోతారు. తెలుసా అమ్మా నీకు ?
ఇలా ఎరువుకీ గులాబీ కీ మధ్య కాట్ వాక్ చేసే వాళ్లకు క్యూబా సంఘీభావ కమిటీ లో మాట్లాడ్డం అంత కామెడీ మరొకటి లేదు.
ముప్పై మూడు వక్కలై చెక్కలై చెదిరిన స్వప్నాల లో ఏ ముక్క ఎక్కడో ఏ వెలుగులకి ఈ ప్రస్థావనో అర్ధం కాక ఎర్ర జెండా తన తలను తానే నేలకి బాదుకుటోంది
నిజంగా మాకు బుర్ర ఉంటె ఆ మీటింగ్ క్యూబన్ అనుభవాల నుండి నేర్చుకునే గుణపాఠం ఏదన్నా ఉంటె అది బాగుండేది.
బక్క చిక్కిన సొమ్మసిల్లిన నీకు వీళ్లిచ్చే సాలిడారిటీ ఏముంది తల్లీ
చివర మాట.
హాల్ లో స్థలం లేక రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చుని ఇది రాస్తున్న..
అమ్మా అలీదా ఇక్కడ ఇంటింటికీ అమెరికా ముద్ర, వంట గదికి అమెరికా అలెక్స
కాపలా. ఎక్కడమ్మా నువ్వులేనిది అమెరికా అని పాడుకోవాలి.
నా ముందు bmw,ఫోర్డ్, కియా,ఫార్చ్యూనర్ ఇన్నోవా , బెంజ్ , సుజుకి లాంటి ఖరీదైన కార్లు వేసుకుని బక్క చిక్కిన విధి వంచితురాలు అయిన అలీదా గువేరా
కు సంఘీభావం చెప్పడానికి వచ్చాము. మొత్తానికి మా మాటల యుద్దాన్ని అజ్ఞానాన్నీ నీ ముందు ఒలకబోసాం అంతిమ ఘట్టం ముగిసింది అన్నమాట.
అమ్మా అలీదా
ఆ వేదిక మీద కాకుండా నువ్వు ఏ ఇంద్రవెళ్లి స్థూపన్నో, కూలిన హుస్నాబాద్ స్థూపాన్నో , పాతపల్లి కో ,చెంచు గూడేనికో , భద్రాచలం పోలవరం నిర్వాశితుల కొంపల కో వీలుంటే అబూజ్ మడ్ కో అధమా మా జార్జ్ రెడ్డి సమాధినో ఒక్క సారి వెళ్లి చూసి ఉంటే
మీ అయ్య ఆశయం ఇక్కడ బ్రతికే ఉంది అని తృప్తి తో అన్నా మీ ఊరు వెళ్లేదానివి
నీకెన్ని కష్టాకు వచ్చాయి అలీదా
వీలుంటే మా అజ్ఞానాన్ని క్షమించు.
గుర్రం సీతారాములు