బీజేపీలో చేరికపై ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మత్తి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారు. బీజేపీలో చేరడం ఖాయమనుకున్నా ఆఖరి నిమిషంలో రేవంత్ చక్రం తిప్పడంతో పొంగులేటి ఆగిపోయారు. కాంగ్రెస్సా..? బీజేపా.? ఏది అయితే బెటర్ ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నారు.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సమైక్యవాదానికి మొగ్గు చూపిన వైఎస్సార్ సీపీ నుంచే 2014 ఎన్నికల్లో పోటీ గెలిచి సత్తా చాటారు. ఆ తరువాత అధికార పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కారెక్కారు. నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆయనకు… 2019 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ షాక్ ఇచ్చారు.
ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. కేసీఆర్ ఏదైనా పదవి కట్టబెట్టకపోరా అని వెయిట్ చేశారు. కానీ ఏ పదవి కట్టబెట్టలేదు. పైగా ఆయన అనుచరవర్గాన్ని పార్టీలో ఇబ్బంది పెట్టడం పొంగులేటికి రుచించలేదు. అందుకే..తనకు అవమానం జరిగినా సహిస్తా కానీ.. తన అనుచరులకు అవమానం జరిగితే సహించనని ఇటీవల పార్టీ మార్పుపై హింట్ ఇచ్చారు.
వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ నేతలు పొంగులేటితో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా ఆయన బీజేపీలోకి చేరుతారని అంతా భావించారు. బీఆర్ఎస్ ఖమ్మం సభ రోజునే అమిత్ షాతో భేటీ అయి.. బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన చేరిక వాయిదా పడింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కాస్త ఆలస్యంగా ఆహ్వానం పంపింది కాంగ్రెస్. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉండటం.. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించడంతో పొంగులేటి బీజేపీలో చేరికపై ఆలోచనలో పడిపోయారు. బీజేపీ కంటే ఖమ్మంలో కాంగ్రెస్సే బలంగా ఉంది కాబట్టి.. కాంగ్రెస్ లోనే చేరాలని అనుచరులు ఒత్తిడి తీస్తున్నారు.
ఫిబ్రవరి 6నుంచి భద్రాద్రి నుంచి పాదయాత్ర చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి.. ఆలోపే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటిపై అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రాథమికంగా పొంగులేటి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు అంగీకరించారని తెలుస్తోంది.