తమ భాషే గొప్పది. తామున్న చోటుకు వచ్చి తమ భాషను మాట్లాడకపోవడమంటే మా భాషను అవమానించినట్టేననే మూర్ఖత్వం తమిళులు, కన్నడిగులలో ఎక్కువైపోతుంది. భాషాభీమానంతో హద్దులు మీరి మరీ ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా దాడులకు పాల్పడుతున్నారు.
కన్నడలో మాట్లాడనందుకు సింగర్ మంగ్లీపై దాడికి పాల్పడ్డారు. బళ్ళారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్ళు రువ్వారు. దుండగులు రాళ్ళు రువ్వుతున్న సమయంలో అసలేం ఏం జరుగుతుందోనని కారులోనున్న మంగ్లీ, ఆమె సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మంగ్లీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కారు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. మంగ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
అసలేమైందంటే..బళ్ళారి మున్సిపల్ స్టేడియంలో ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ కు పయనమయ్యారు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. దాడికి కారణం ఏంటంటే.. కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడమే. ఇటీవల చిక్‌బళ్లాపూర్ లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న మంగ్లీని తెలుగులో మాట్లాడాలని ప్రేక్షకులు కోరారు. ఏపీ బోర్డర్ కనుక చాలా మందికి తెలుగు కూడా వచ్చి ఉంటుంది కనుక, నేను తెలుగులోనే మాట్లాడతానన్నారు మంగ్లీ.
కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చి తెలుగులో మాట్లాడటంపై అక్కడి వారు రగిలిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే.. మంగ్లీ కన్నడలో మాట్లాడాలంటే ఆమెకు భాష వచ్చి ఉండాలి కదా అనే కనీస ఆలోచన లేకుండా ఈ దాడికి పాల్పడ్డారు.