తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే తనకు హైకమాండ్ అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా పార్టీ నేతలను ఐక్యం చేయాలనే అధిష్టానం సూచనలతో అదే అంశంపై దృష్టిసారించారు.
గాంధీ భవన్ కు రానని.. రేవంత్ రెడ్డితో వేదిక పంచుకొనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గాంధీ భవన్ మెట్లు ఎక్కించారు. రేవంత్ తో కలిసి కూర్చోబెట్టారు. కలిసి మాట్లాడుకునేలా చేశారు. సీనియర్లలో బలమైన నేతగానున్న కోమటిరెడ్డి కూడా పట్టువీడుపులు వీడటంతో మిగతా సీనియర్లు కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు.
అధికార పార్టీపై పోరాడకుండా తమలో తాము పోరాడుకుంటున్న టి. కాంగ్రెస్ నేతలకు మాణిక్ రావు థాకరే ఓ ఫార్ములాను సెట్ చేశారు. రేవంత్ పాదయాత్ర చేస్తే తమకు పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మొండికేస్తోన్న సీనియర్లకు సర్దిచెప్పారు.. రేవంత్ రెడ్డికి యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. మిగతా సీనియర్లు ఇరవై నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకోవచ్చని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
ఎదో ఒక దానికి అంగీకరించకపోతే.. థాకరేతో ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి.. సీనియర్లు సైతం తలూపాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కొత్త కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
అదే సమయంలో థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. ఎవరికీ అనుకూలం కాదని చెప్పారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని .. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.