2002లో గుజరాత్ లో చెలరేగిన అల్లర్ల వెనక మోడీ హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మోడీని నరహంతకుడు అని విమర్శలు చేస్తుంటారు. అధికారం కోసం ఇదంతా చేయించారన్న ఆరోపణలు మోదీపై ఉన్నాయి. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ అల్లర్లలో మోడీ పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చినా అంత ఈజీగా మోడీని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. కేంద్రదర్యాప్తు సంస్థలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయి బీజేపీ ఏజెంట్లుగా పని చేస్తున్నాయి కాబట్టి.
ఇకపోతే..గుజరాత్ అల్లర్ల వెనక మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీని ఇటీవల విడుదల చేసింది. ఈ అల్లర్లకు మోడీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసి డాక్యుమెంటరీలో తేల్చింది. అయితే.. ఆ డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను గురువారం యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసింది. అయితే, అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర సమాచార శాఖ ఈ వీడియోను తొలగించింది.
ప్రధానికి వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేక బీబీసీ ఈ డాక్యుమెంటరీని తీసుకొచ్చిందని కేంద్రం ఆరోపించింది. సామజిక మాధ్యమాల్లోనున్న బీబీసీ లింక్ లను వెంటనే తీసివేయాలని ఫేస్ బుక్ , యూట్యూబ్ లను కేంద్రం కోరింది. కేంద్రం ఆదేశాల ప్రకారం “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీకి సంబంధించిన అనేక ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించడం లేదు.
ఆ డాక్యుమెంటరీలో ఎంత ఎంత నిజముందో.. ఎంత అబద్దముందో ప్రజలు తెలుసుకోకుండా కేంద్రమే వాటిని తొలగించడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం వల్ల గుజరాత్ అల్లర్ల వెనక ఎవరి పాత్ర ఉందనే చర్చ మరోసారి జరగడానికి కేంద్రమే అవకాశం కల్పించినట్లు అయింది.