తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయినట్లుంది. అందుకే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్ లో ఆకర్షణీయమైన కేటాయింపులు చేసి మరోసారి ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ పద్దులు సహజంగా మార్చిలో ప్రవేశపెడుతారు. కేంద్రం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెడుతోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆధారంగా రాష్ట్రాలు బడ్జెట్ లో కేటాయింపు చేసుకుంటాయి. అయితే.. ఈసారి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లోనే తెలంగాణ సర్కార్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటివారంలో పెట్టాల్సిన బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టాలనుకోవడంతో ముందస్తు ముచ్చట మరోసారి తెరపైకి వచ్చింది. ముందస్తు వ్యూహంలో భాగంగానే బడ్జెట్ సమావేశాలను ముందుకు జరిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీని రద్దు చేస్తారని చెప్పారు.
గత వారం రోజులుగా బడ్జెట్ కేటాయింపులపై కసరత్తు జరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఈ నెల 9న రాష్ట్ర సర్కార్ అన్ని శాఖలను ఆదేశించింది. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో పంపాలని పేర్కొంది. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు.
ఈ బడ్జెట్ పై కేసీఆర్ శనివారం ఉన్నాతాదికారులతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ కేటాయింపులు ఉండేలా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ చేస్తున్న హడావిడి చేస్తుంటే కేసీఆర్ ఆర్థిక సంవత్సరం రాక ముందే బడ్జెట్ ఆమోదించేసుకుని ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : కర్ణాటకతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు