హైదరాబాద్ నడిబొడ్డున 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిగో, అదిగో ప్రారంభిస్తున్నామని చెప్పి రెండేళ్ళు అవుతుంది. కాని ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను నేటి తరానికి తెలియజేసేందుకు వీలుగా ఆయన విగ్రహంతోపాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిజంగా.. అంబేడ్కర్ పై కేసీఆర్ కు అంత గౌరవం ఉన్నదా..? అనేది ప్రశ్నార్ధకమే.
అంబేడ్కర్ జయంతి, వర్ధంతి వేడుకల సమయంలో ఆయన విగ్రాహానికి కేసీఆర్ నివాళులర్పించేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. కేవలం పత్రిక ప్రకటనలకు పరిమితం అవుతూ భారత రాజ్యాంగ నిర్మాతపై వివక్ష ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కులాధిపత్యంతో విర్రవీగే కేసీఆర్.. కుల వివక్ష కోసం జీవితకాలం పాటుపడిన అంబేద్కర్ కు గౌరవం ఎలా ఇస్తారు..?పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి దుండగులను శిక్షించాలని.. తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఏనాడూ ఆ విగ్రహ పునఃప్రతిష్ట కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి కేసీఆర్ కు అంబేద్కర్ పై ఉన్నట్టుండి ప్రేమ పొంగుకొచ్చిందంటే కారణం రాజకీయమే తప్ప మరొకటి కాదు.
ఓ వైపు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని అమలు చేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీపై యుద్ధం చేస్తానంటున్న కేసీఆర్.. ఈ విషయంలో వారికీ కోరస్ ఇచ్చారు. ప్రస్తుత భారత రాజ్యాంగం పనికి రాదంటూ.. కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. పైగా.. ఈ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తనను తాను సమర్ధించుకున్నారు. భారత రాజ్యాంగం అమలుతో సత్ఫలితాలు లేకుంటే రాజ్యాంగాన్ని చితిలో వేయండని అంబేద్కర్ చెప్పడాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని అంబేడ్కర్ ఎందుకు చెప్పాడో అసలు విషయం చెప్పకుండా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే విధంగా ఆయన కామెంట్స్ చేశారు.
రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’’ అని డా.బి.ఆర్. అంబేడ్కర్ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడంలో పాలకుల వైఫల్యం.. అహంకారం వలన భారత రాజ్యాంగంపై ఈ విధమైన కామెంట్స్ వస్తున్నాయి. రాజ్యాంగం అమలులో దేశ పాలకుల వైఫల్యాలను వివరించాల్సిన కేసీఆర్ పాలకుల వైఫల్యాలను కప్పి పుచ్చి ఆ నిందను రాజ్యాంగంపైకి ఎగదోస్తున్నారు. ఇందులో కేసీఆర్ సఫలీకృతం అవుతున్నారు.
అయితే.. కొత్త రాజ్యాంగం అవసరమంటునే అంబేద్కర్ ను కేసీఆర్ కీర్తించడం వలన ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి. గడిచిన కొన్నాళ్ళుగా దళిత ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాల వలన దళిత సమాజం చైతన్యం అయింది. దాంతో ఆ సామజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు అంబేద్కర్ పేరును విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు అంబేడ్కర్ పేరు ఎత్తెందుకే సహించని నేతలు.. ఇప్పుడు అంబేడ్కర్ నామ స్మరణ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఇదంతా సామజిక ఉద్యమాల ప్రభావం కావొచ్చు. అందుకే అంబేద్కర్ ను అన్ని పార్టీలు ఒన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.
కేసీఆర్ అంబేడ్కర్ విషయంలో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ద్వారా అని కేసీఆర్ ఎక్కడా చెప్పడం లేదు. అంబేద్కర్ లేకుంటే తెలంగాణ ఓ మిథ్య అనే విషయాన్నీ చెప్పలేకపోతున్నారు. తన ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిందని చెప్పుకుంటున్నారు. అలాంటి కేసీఆర్ కు అంబేద్కర్ కు ప్రేమ పొంగుకు రావడం రాజకీయమే. రెండు, మూడేళ్ళుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మీనవేశాలు లెక్కించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో హడావిడి చేస్తోంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహం ఓట్లను రాల్చుతుందని ఆశించడం అమాయకత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదు.