ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టువీడారు. గాంధీ భవన్ మెట్లను ఎక్కారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడేది లేదని గతంలో తేల్చి చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టకేలకు రేవంత్ తో సమావేశమయ్యారు. 40నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది స్పష్టత లేదు. కాని పార్టీ పటిష్టతపైనే చర్చించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి- రేవంత్ రెడ్డిల భేటీతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ పాదయాత్రకు ఐదు రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి.
గాంధీ భవన్ లో కోమటిరెడ్డి ప్రత్యక్షం కావడంతో రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. సీనియర్లంతా రేవంత్ పాదయాత్రకు బ్రేకులు వేసేందుకు తెరవెనక కత్తులు నూరుతుంటే.. రేవంత్ అంటేనే ఒంటికాలి మీద లేచే కోమటిరెడ్డి మాత్రం ఆయనతో భేటీ కావడం పార్టీ వర్గాలనే విస్మయానికి గురి చేసింది. రేవంత్ తో కలిసి పని చేయాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినా పెద్దగా ఖాతరు చేయలేదు. పైగా.. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన షోకాజ్ నోటిసులపైన ఇటీవల స్పందిస్తూ వాటిని చెత్తబుట్టలో పడేసానని అవమానకరంగా మాట్లాడారు. ఇక.. కోమటిరెడ్డి ఎవరు చెప్పిన మారరని.. ఆయన దారి ఆయనదేనని అంత అనుకుంటుండగా గాంధీ భవన్ లో ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావు ధాక్రే నియమితులైన తర్వాత తొలి సారి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు 11, 12 తేదీలలో సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన తాను గాంధీ భవన్ కు రానని..బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు.దానికి తగ్గట్లుగా తర్వాతి రోజు.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. కానీ రెండో సారి మాణిక్ రావు థాక్రే.. తెలంగాణ పర్యటనకు వచ్చే సరికి ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పుకున్నారు.
అసలు రేవంత్ తో ఇక మాట్లాడనని.. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టకేలకు వెనక్కి తగ్గడం పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుంది. మిగతా సీనియర్లను పక్కన పెడితే.. రేవంత్ కు తోడుగా కోమటిరెడ్డి నిలిస్తే చాలునని అంత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ కనిపించడంతో గాంధీ భవన్ లో సందడి వాతావరణం కనిపించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ థాకరే మొత్తానికి రెండో పర్యటనలోనే తన మార్క్ రాజకీయాన్ని చూపించినట్లుగా వీరి భేటీతో అర్ధం అవుతుంది. చూడాలి రానురాను ఎలాంటి మార్పు తీసుకోస్తారో.