విశాఖతో పోలిస్తే చిన్న, చిన్న నగరాల్లో కూడా మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాని విశాఖలో మాత్రం ఇంకా మెట్రో కూత వినబడటం లేదు. మెట్రో రైలు సేవల కోసం టీడీపీ హయంలో చేసిన ప్రయత్నాలను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడం.. కనీసం పైసా కూడా కేటాయించకపోవడంతో విశాఖకు మెట్రో రైలు ఓ కలగానే మిగిలిపోయింది.
విశాఖను రాజధానిగా చేయాలని పట్టుదలగానున్న జగన్ సర్కార్ మెట్రో సర్వీసులను ప్రారంభించాలని అస్సలు అనుకోవడం లేదు. వైసీపీ హయంలోనే మెట్రో సేవలు ప్రారంభం అవుతే జగన్ సర్కార్ కే ఖ్యాతి దక్కుతుంది. అయినప్పటికీ ఎందుకో మెట్రో రైలు ప్రారంభంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
2019 ఎలక్షన్ టైంలోనే విశాఖకు రైల్వే జోన్ అంటూ కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం కోరిన మీదట విశాఖకు మెట్రో రైలుపై రూ.18వేల కోట్లు అవసరమవుతుందని నాటి టీడీపీ ప్రభుత్వం నివేదిక పంపింది. దానిని పురోగతిపై కేంద్రాన్ని అడగాల్సిన జగన్ సర్కార్ మొద్దు నిద్ర పోతుంది.
విజయవాడలోనున్న ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయాన్ని 2020లో విశాఖకు తరలించారు. 2024 కల్లా మెట్రో పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. కాని ఇప్పటివరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. మెట్రో రైలు ఆఫీసును విశాఖకు తరలించడం తప్ప జగన్ సర్కార్ చేసిందేమీ లేదు.
దేశం మొత్తం మీద ఏపీ, ఒడిశాలో మాత్రమే మెట్రో రైలు లేని ‘అర్బన్ సిటీస్’ఉన్నాయి. టీడీపీ హయాంలో విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 79.91 కి.మీ. లైట్ మెట్రో రైలు కారిడార్లు, 60 కి.మీ మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ల అభివృద్ధి కోసం ఆనాడే మాస్టర్ ప్లాన్, డిపిఆర్ రూపొందించారు. లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్‌ల నిమిత్తం రెండు డిపిఆర్లు వేర్వేరుగా తయారుచేసి ట్రాఫిక్ ఇతర అంశాలపై అధ్యయనం చేసిన అనంతరం 75.31 కి.మీలో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని నాటి కన్సల్టెంట్లు ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి సిఫారసు చేశారు.
2017 డిసెంబరులో మధురవాడ నుంచి గాజువాక 44 కి.మీ మెట్రో వేసేందుకు విజయవాడ-విశాఖ రైల్వే అధికారులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించింది. విశాఖలో 2028 సంవత్సరం నాటికి 144 కి.మీ మెట్రో పూర్తికావాలనే లక్ష్యాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం ఆ కసరత్తును ముందుకు తీసుకెళ్లినా విశాఖ మెట్రోకు ఓ రూపు వచ్చేది. జగన్ సర్కార్ మెట్రోపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఏపీలో చర్చే లేకుండా పోయింది.