కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ తెరవెనక కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకకు చెందిన 25మంది కాంగ్రెస్ నేతలను పిలిచి వారికీ 500 కోట్ల ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఇదంతా జరిగిందన్నారు. ఈ విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియడంతో కాంగ్రెస్ నేతలను పిలిచి క్లాస్ పీకిందని చెప్పారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న సునీల్ కనుగోలు ఆఫీసుపై తెలంగాణ పోలీసులు దాడి చేయడానికి ప్రధాన కారణం.. కాంగ్రెస్ పార్టీ స్టోర్ చేసి పెట్టుకున్న వ్యూహాలను తస్కరించేందుకేనని రేవంత్ ఆరోపించారు. మాదాపూర్ లోని సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేసి.. కంప్యూటర్లలో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని కేసీఆర్ తెలుసుకొని రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచే నేతలను కేసీఆర్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారని.. ఈ విషయం జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలీదన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బిఆర్ఎస్ మీటింగ్ కు కుమారస్వామి రాకపోవడానికి అదే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ పై యుద్ధం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలనుకుంటున్నారని.. ఈ విషయం నిజం కాదంటే.. కేసీఆర్ ఖండించాలని డిమాండ్ చేశారు రేవంత్.
కర్ణాటకతోపాటే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని.. బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించరని రేవంత్ చెప్పుకొచ్చారు.