చంద్రబాబుతో భేటీ ఆపై రణస్థలిలో సభ తరువాత టీడీపీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. గౌరవం ఉన్న చోట ఉంటామని.. అవమానిస్తే ఆలోచిస్తే ప్రసక్తే లేదని తేల్చేశారు పవన్ కళ్యాణ్. అవసరమైతే మరోసారి ఒంటరిగానైనా పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. రణస్థలిలో పవన్ వాడిన గౌరవం అనే పదంపై మరోసారి సర్వత్ర చర్చ జరుగుతోంది.
గౌరవప్రదమైన పొత్తులతో ముందుకు వెళ్తామని ప్రకటించిన జనసేన ఎన్ని సీట్లు కోరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 20సీట్లను పవన్ కోరుతున్నారని వైసీపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో భాగంగా 55 స్థానాల్లో వైసీపీకి జనసేన నుంచి టఫ్ ఫైట్ నడిచింది. అక్కడ జనసేన గణనీయమైన ఓట్లు చీల్చడం వైసీపీ విజయానికి ప్రధాన కారణమైంది. అందుకే రానున్న ఎన్నికల్లో పొత్తు కుదిరితే 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అయితే ఇది సహేతుకమైన డిమాండ్ అని వారు భావిస్తున్నారు. కాని టీడీపీ నుంచి మాత్రం అన్ని సీట్లు అంటే కష్టమనే రియాక్షన్స్ వస్తున్నాయి.
జనసేనకు కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలో మంచి పట్టుంది. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఓట్లకు తగ్గకుండా ఓట్లను సాధించింది. మరికొన్ని చోట్ల 20వేలకు పైగా ఓట్లను సాధించి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. ఇటువంటి నియోజకవర్గాలు 20వరకు ఉన్నాయి. ఇక 5 వేల నుంచి 10 వేల మధ్య ఓట్లు పొందిన నియోజకవర్గాలు 15 ఉన్నాయి. పది నుంచి 20 వేల మధ్య ఓట్లు సాధించిన నియోజకవర్గాలు 10వరకూ ఉన్నాయి. అయితే.. అప్పటికీ , ఇప్పటికీ జనసేనకు ఆదరణ పెరిగింది. ప్రజల్లో నమ్మకం కూడా ఏర్పడింది. దీంతో 2019ఎన్నికల్లో జనసేన గట్టి పోటీనిచ్చిన ఆ 55 నియోజకవర్గాలను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే పవన్ నుంచి ‘గౌరవం’ అన్న కామెంట్ బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
జనసేన కోరుతున్న సీట్లపై టీడీపీ నుంచి మరో వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఎక్కడైతే 20 నుంచి 30 వేల వరకూ ఓట్లు రాబట్టిందో ఆ స్థానాలే.. అంటే దాదాపు 25 సీట్లు ఇస్తామని టీడీపీ సూచించిందట. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం పొత్తు ఖరారు అయిందని.. 22 నుంచి 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్ సభ స్థానాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే రకంగా ప్రచారం చేస్తోంది.