తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గట్టుగానే ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల రంగాలలో అన్నింటా అబద్దాలే వల్లిస్తున్నారు కేటీఆర్. లక్షకుపైగానే ఉద్యోగాలు ఇచ్చామని అబద్దపు లెక్కలు చెబుతున్న కేటీఆర్.. పెట్టుబడుల విషయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ అబద్దాలను నిసిగ్గుగా చెబుతున్నారు.
మంత్రి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఆయన పీఆర్ టీమ్ మాత్రం ఒకే ప్రచారం చేస్తుంటుంది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే కేటీఆర్ పర్యటన అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తోంది. గతంలో ఇలాంటి ప్రకటనలే చేసి కేటీఆర్ టీమ్ దొరికిపోయింది. తాజాగా మరోసారి కేటీఆర్ అబద్దాల మంత్రి అని చెప్పేందుకు రుజువు దొరికింది.
మంత్రి కేటీఆర్ ప్రతీ వారం ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించామని …లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ అన్నీ ఎంవోయూలే కానీ.. ప్రారంభమవుతున్న పరిశ్రమల గురించి మాత్రం ఎక్కడా ప్రచారం జరగడం లేదు. నిజంగా కేటీఆర్ చెప్పినన్ని పెట్టుబడులు వచ్చాయా అంటే అధికారిక లెక్కలో కనిపించడం లేదు.
తెలంగాణకు 2021-22లో వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ. 11965 కోట్లు. కర్ణాటకకు వచ్చినవి 1,63,798 కోట్లు. విధేశీ పెట్టుబడులు అంటేనే అంతర్జాతీయ బ్రాండ్లు పెట్టే పెట్టుబడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ , ఢిల్లీ, తమిళనాడులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్థానంలోనే తెలంగాణ ఉంటోంది. కాని తెలంగాణే అంతర్జాతీయ పెట్టుబడులు ఎక్కువ ఆకర్షిస్తోందని పదేపదే కేటీఆర్ చెబుతుండటం గమనార్హం. మరి కేటీఆర్ చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ?. ఇది మాత్రం ఎవరికీ అంతుచిక్కని అంశంగా మారింది.