మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఒకే రాజధాని ఉండాలనే కాన్సెప్ట్ కు జగన్ అంగీకరించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఆ ఒక్క రాజధాని అమరావతి కాదు విశాఖపట్నం. ఇంత హడావిడిగా ఒకే రాజధాని నిర్ణయానికి జగన్ ఒకే చెప్పడానికి కారణం ఉంది. త్వరలో అక్కడ అక్కడ ఇన్వెస్టర్స్ మీట్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే పెట్టుబడిదారులకు రాజధాని అంటే ఏం చెబుతామని ఆలోచించి.. విశాఖపట్నంకు ఓటేసినట్లు తెలుస్తోంది.
పెట్టుబడిదారుల సదస్సుకు జగన్ చాలామందిని ఆహ్వానించారు. ఈ సదస్సుకు వచ్చిన వారంతా మీ రాజధాని ఏదని అడిగితే మూడు రాజధానులు అని చెప్తే బాగుండదని అనుకున్నారో ఏమో కాని విశాఖను రాజధానిగా ఫైనల్ చేశారు. ఇన్వెస్టర్స్ కు విశాఖ రాజధానిగా చేబితే వారంతా సటిస్ ఫై అవుతారని వైసీపీ నేతల నమ్మకం.
అమరావతిని కాదని విశాఖను మాత్రమే రాజధానిగా ప్రకటించాలంటే అనేక చట్టబద్దమైన సమస్యలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారన్నది ఇప్పుడు కీలకం. జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ ఉంది. 261మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారి వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించలేరు. అధికారికంగా ప్రకటన చేయలేరు. కానీ జనవరి 31న స్టే వస్తుందని.. వైసీపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అందుకే విశాఖ రాజధానిగా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.