సంక్రాంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ప్రారంభిస్తామని మొదట ప్రకటించారు. కాని ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరికి మార్చారు. కేసీఆర్ పుట్టిన రోజునే ఈ కార్యక్రమం పెట్టుకుంటే అన్నింటికి కలిసి వస్తుందని చివరికి ఆ తేదీనే ఖరారు చేశారు. ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
నిజానికి ఆరేడు నెలల్లోనే తెలంగాణ సచివాలయం పూర్తి చేయాలనుకున్నారు. కాని మూడేళ్ళు దాటిపోయింది. మధ్యలో కరోనా కారణంగా మరికొంత ఆలస్యం అయింది. దసరాకు ప్రారంభించాలని అనుకున్నా ఆ తరువాత సంక్రాంతి అనుకున్నారు. కాని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు.
20ఎకరాల స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో కొత్త సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. ఆరు అంతస్తుల్లో పాలన విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్ ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్ ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్ర అవశేషాలు ఉండకూడదని నూతన సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా మరో చోట సెక్రటేరియట్ అనుకున్నారు. కాని సాధ్యం కాలేదు. ఏపీలో సర్కార్ మారడంతో కొత్తగా వచ్చిన జగన్ సర్కార్ భవనాలు మొత్తం తెలంగాణ సర్కార్ కు అప్పగించడంతో వాటిని కూలగొట్టి కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టారు.